ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
భీమవరం: పీఆర్సీ కమిటీపై తక్షణం నిర్ణయం తీసుకోకుంటే ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సాయివర్మ మాట్లాడుతూ పదవీ విరమణచేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ పెన్షనరీ బెనిఫిట్స్‌ను పదవీ విరమణ చేసిన రోజునే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతమున్న హెల్త్ కార్డుల వల్ల ఉపాధ్యాయులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దావీదు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీడీ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పప్పాల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలలోను, ఉన్నత విద్యాసంస్థలలో కొనసాగుతున్న కుల ఆధారిత వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నిర్ధారించేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన ఈక్విటీ నిబంధనలను 2026 తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద ఏఐఎస్‌ఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోస్టర్స్ విడుదల చేశారు. అప్పలస్వామి మాట్లాడుతూ యూజీసీ నిబంధనలపై నడుస్తున్న సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని, విశ్వ విద్యాలయాలల్లో జరుగుతున్న హింసను అరికట్టేందుకు రోహిత్ చట్టంను తక్షణమే అమలు చేయాలన్నారు.
పాలకొల్లు సెంట్రల్: అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ ప్లీనరైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ (ఆర్‌డీ) జి.సుబ్బారావు అన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం చైర్మన్ చాంబర్‌లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎల్‌టీపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లపై ప్రజల్లో ఇంకా స్పష్టత లేదన్నారు. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియని ప్రజలు ఉన్నారని అలాంటి వారికి కూడా అర్థమయ్యేలా టౌన్‌ప్లాన్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఏ వార్డుల్లో ఎంత మంది బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల పరిధిలో ఉంటారో వారికి గ్రూపు క్రియేట్ చేసి సమాచారం ఇవ్వడం లేదా వారి వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. బిల్డింగ్ క్రమబద్దీకరణలో భాగంగా ఎవరైనా బీపీఎస్‌కు వర్తించి భారీ స్థాయిలో నగదు చెల్లించే పరిస్థితి ఉంటే వారికి ఈఎంఐ పద్ధతిలో అవకాశం కల్పిస్తామన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాల నుంచి అందే ఆదాయంతో పాటు నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపుల ద్వారా అందే ఆదాయం జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా


