తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, భీమవరం: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుత విద్యాసంవత్సరానికి జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని 3,16,328 మంది విద్యార్థుల్లో 2,29,106 మందిని అర్హులుగా గుర్తించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున రూ. 343.81 కోట్లను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. రూ.2,000 కోత పెట్టి గతేడాది జూన్ 12న తొలి విడతగా 1,76,574 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.229.55 కోట్లను జమచేసింది. తర్వాత వచ్చిన గ్రీవెన్‌న్స్‌లో 12,553 మందికి అందించగా, ఫోర్ వీలర్, స్థలం, ఇన్‌కంటాక్స్, విద్యుత్ బిల్లులు తదితర వాటిని సాకుగా చూపించి పక్కనపెట్టేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు లబ్ధిదారులకు రూ.13 వేలు కూడా పూర్తిగా ఇవ్వకుండా రూ.8000 వేల నుంచి రూ.8850 మాత్రమే జమచేశారు. అందరికి ఇచ్చేశామంటూ గురువారం శానస మండలిలో కూటమి ప్రజాప్రతినిధులు చెప్పడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మండలి వేదికగా సర్కారు అవాస్తవాలు
తల్లికి వందనం అందరికీ ఇచ్చామంటూ బుకాయింపు
జిల్లాలో పూర్తిస్థాయిలో అర్హులకు అందని సాయం
జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106
మొదటి విడతలో 1,76,574 మంది, గ్రీవెన్స్‌లో 12,553 మందికి లబ్ధి
కొందరికి రూ. 8 వేల నుంచి రూ. 9 వేలు మాత్రమే జమ
వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన తోట పెద్దిరాజు వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఆయన ఇద్దరు కుమార్తెలు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పెద్దిరాజుకు సెంటు భూమి లేదు. ఆయన పేరిట 46 ఎకరాలు భూమి ఉన్నట్టు చూపిస్తోందంటూ, అతని భార్యకు తల్లికి వందనం సాయం అందించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి సాంకేతిక లోపాన్ని సరిచేయించుకున్నా సాయం అందలేదని చెబుతున్నారు.
పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్‌కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు.
కుముదవల్లికి చెందిన సాయిబాబా, వెంకటరమణ దంపతులు.. తల్లి లేని మనువరాలు మేఘనను తమ వద్దే ఉంచుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అర్హత ఉన్నప్పటికి కార్డులో పేరు లేదని చెప్పి వారికి సాయం అందించలేదు. సాంకేతిక లోపాన్ని సరిచేయించుకుంటే తర్వాతి ఏడాది వస్తుందని అధికారులు చెప్పినట్టు సాయిబాబా తెలిపారు.
తల్లికి వంచన


