ఆదాయం మితం.. ఖర్చు అధికం
పట్టిసం పంచాయతీ ఆదాయం ఇలా..
● పట్టిసం ఉత్సవాల నిర్వహణ తీరు
● సరిపడా నిధులు లేవంటున్న పంచాయతీ
● ఐదేళ్లుగా టెండర్‌దారులకు రూ.29 లక్షల బకాయిలు
పోలవరం రూరల్ : పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పంచాయతీకి వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. దీంతో ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా ఉత్సవాల నిర్వహణకుగాను టెండర్‌దారులకు రూ.29 లక్షలు బకాయిలు ఉన్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
సగం కూడా రాని ఆదాయం
2020 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లాంచీలు లేకపోవడం, నీటి ప్రవాహం మారిపోయి ఉత్సవాల సమయంలో నీరు తగ్గడంతో అధికార యంత్రాంగం పరిశీలించి నది మధ్యలో పంట్లు ఏర్పాటు చేసి భక్తులు కాలినడకన వెళ్లి వచ్చే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ, పట్టిసం ఫెర్రీ, సైకిల్ స్టాండ్‌ల వేలం నిర్వహిస్తారు. అలాగే ఉత్సవాల సమయంలో ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసే దుకాణదారుల నుంచి అశీలు వసూలు చేస్తుంటారు. ఉత్సవాల సమయంలో ఈ సొమ్ము ఖర్చు చేస్తుంటారు. ఏటా రూ.18 నుంచి రూ.20 లక్షల వరకు గ్రామ పంచాయతీ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆదాయం మాత్రం అందులో సగం కూడా రావడం లేదంటున్నారు.
ఫెర్రి కాంట్రాక్టర్ చేపట్టే పనులివే..
ప్రతి సంవత్సరం ఇసుక తిన్నెలపై దుకాణదారుల నుంచి సమారు రూ. 75వేలు ఆశీలు వసూలు అవుతుంటాయి. ఫెర్రీ కాంట్రాక్టర్ భక్తులను నదిదాటించేందుకు అవసరమయ్యే ర్యాంపులు, క్యూలైన్‌లు, టిక్కెట్ కౌంటర్‌లు, చలువ పందిళ్ళు, ప్లాట్‌ఫారాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తుంటారు. గ్రామపంచాయతీ ఇసుక తిన్నెలపై చలువపందిళ్ళు తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పలు శాఖల అధికారుల క్యాంపు కార్యాలయాల, లైటింగ్, జనరేటర్లు, చేతిపంపులు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా కొన్ని పనులు పంచాయతీ, కొన్ని పనులు ఫెర్రీ కాంట్రాక్టర్ చేపడుతారు. వీరు చేసే తాత్కాలిక పనులకు వెదురుకర్రలు, బాదులు, తాటాకు, ఎవదురుకంప వినియోగిస్తారు. వీరిని అధికారుల ఆదేశాల మేరకు అటవీప్రాంతం నుంచి తెచ్చుకుంటారు. ఉత్సవాల్లో సమయంలో వీటిని వినియోగించి, తదుపరి వీటిని అమ్మి, సొమ్ము చేసుకుంటారు.
లాంచీ టికెట్ రేటు పెంచినా..
గత సంవత్సరం లాంచీ టిక్కెట్ ధర రూ. 30 ఉండగా, అదనంగా రూ.10 పెంచి వసూలు చేయగా, రూ.8 లక్షలు ఆదాయం వచ్చింది. మరలా ఈ ఏ డడాది కూడా రూ.10 పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఆదాయానికి, ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందని, ఉత్సవాలు అనంతరం ఖర్చుల వివరాలపై అధికారులు దృష్టి సారించి ఆలయానికి వచ్చే వాస్తవ ఆదాయాన్ని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టిసం శివక్షేత్రం
సంవత్సరం ఫెర్రి ఆదాయం సైకిల్ స్టాండ్ ద్వారా..
2021–2022 రూ. 5 లక్షలు రూ.70 వేలు
2022–2023 రూ.15 లక్షలు రూ.1.40 లక్షలు
2023–2024 రూ.10.05 లక్షలు రూ.1.43 లక్షలు
2024–2025 రూ.11.70 లక్షలు రూ.1.90 లక్షలు
2025–2026 రూ.11.85 లక్షలు రూ.1.91 లక్షలు


