బలివే ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
బలివే( ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేక అధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవదాయ శాఖ జిల్లా అధికారి కే.శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల సహాయంతో భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాట్లు, జల్లుస్నానాల ఏర్పాట్లు పరిశీలించారు.


