తీరం.. దోచేద్దాం
గోదావరి తీరమంతా మనదే.. ఇసుక, లేకుంటే మట్టి ఏదోకటి దోచేద్దాం.. ఇవీ కొంతమంది టీడీపీ నాయకుల ఆగడాలు. పది రోజులుగా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు చేయని ప్రయత్నాలు లేవు.
పెనుగొండ: పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి మొదలై బియ్యపుతిప్ప వరకూ గోదావరి తీరం ఉంది. దీనిలో సిద్ధాంతం నుంచి దొడ్డిపట్ల వరకూ ఓపెన్ ర్యాంపులు, ఆపైన పడవ ర్యాంపులు ఉన్నాయి. అయితే ఇవన్నీ సీఆర్‌జెడ్ పరిధిలోకి రావడంతో నాణ్యత లేని ఇసుక తవ్వకాలకు అనుమతులు నిరాకరించారు. దీంతో రెండేళ్లుగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. అయినా గతేడాది టీడీపీ నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టారు. అయినా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇదే అలుసుగా ఈ ఏడాది ఆచంట నియోజకవర్గం కోడేరులో తొలుత శ్రీకారం చుట్టారు. కోడేరులో ఇసుక అక్రమ తవ్వకాలకు బాటలు వేస్తుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుపడటంతో బాట పనులు నిలిపి వేశారు. దీంతో సిద్ధాంతం మ ధ్యలంక మట్టిపై టీడీపీ నాయకుల దృష్టి పడింది. మధ్యలంక నుంచి నేరుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం ర్యాంపునకు మార్గం ఉండటంతో మట్టి తవ్వకాలు రెండు రోజుల పాటు యథేచ్ఛగా కొనసాగించారు. ఎస్సీ భూములు పాడైపోతున్నాయంటూ ఎస్సీలు గగ్గోలు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి నిరసన గళమెత్తారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలకు బ్రేక్ వేశారు.
ఇక్కడ కాకపోతే మరోచోట..!
అక్రమ ఇసుక తవ్వకాలకు కొందరు టీడీపీ నాయకులు పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో దొంగరావిపాలెం నుంచి మొదలుపెట్టి భీమలాపురం వరకూ గోదావరి తీ రం ఉంది. వీటిలో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, ముత్యాలవారిపాలెం, భీమలాపురంలో ర్యాంపులు ఉన్నాయి. అలాగే గుట్టుచప్పుడు కాకుండా ఇసుక, మట్టి తరలించేందుకు అనువైన మార్గాలు సిద్ధాంతం మధ్యలంక, పెదమల్లం, అణగారలంక, రావిలంక, పుచ్చల్లంకలు ఉన్నాయి. సిద్ధాంతం మధ్యలంక నుంచి గోపాలపురం, అణగారలంక నుంచి యర్రంశెట్టివారిపాలెం, రావిలంక, పుచ్చల్లంకల నుంచి గన్నవరం వెళ్లే మార్గాలు ఉండటంతో టీడీపీ నాయకులు తమకు కలిసి వచ్చిన దారిని మార్గంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా అణగారలంకలో ఇసుక తవ్వకా లకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ శుక్రవారం రాత్రి నుంచి యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే ఊపులో రావిలంక, పుచ్చల్లంకల్లోనూ తవ్వకాలు జరిపి కోనసీమ జిల్లా మీదుగా అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇష్టారాజ్యంగా నదీగర్భంలో నుంచి ఇసుక బాటలు వేస్తున్నా, తవ్వకాలు జరుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకుండా కా లయాపన చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీరం మనదే.. మద్దతూ మనకే, తవ్వుకో దోచుకో అన్న చందాన కొందరు టీడీపీ నాయకుల తీరు ఉందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తవ్వేయ్.. తరలించేయ్
గోదావరిలో ఇసుక, మట్టిపై టీడీపీ నేతల కన్ను
కోడేరు, సిద్ధాంతంలో విఫల యత్నాలు
అణగారలంక, రావిలంకలో తవ్వకాలకు సన్నాహాలు
కోనసీమ జిల్లా వైపు మార్గానికి టీడీపీ నాయకుల యత్నాలు
తీరం.. దోచేద్దాం
తీరం.. దోచేద్దాం
తీరం.. దోచేద్దాం


