అక్రమాలకు అండగా.. అవినీతి మెండుగా..!
అన్నీ తానై వ్యవహరిస్తూ..
కొయ్యలగూడెం: ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంది కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అధికారుల తీరు. రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో కలిసి కలప అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండ, కోనల్లోని చెట్లను యథేచ్ఛగా నరికి కలపను తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వర్జీనియా పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనులు ప్రారంభం కానుండటంతో కలప అక్రమ రవాణా ఊపందుకుంది. నిత్యం రేంజ్ పరిధిలో 40 ట్రక్కులకు పై గా కలపను అక్రమార్కులు పోలవరం, చింతలపూ డి, గోపాలపురం నియోజకవర్గాల్లోని గ్రామాలకు తరలిస్తున్నారు. టన్ను కలపను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, అక్రమార్కులను పట్టుకు న్నా కేసులు నమోదు చేయకుండానే అధికారులు ముగించేస్తున్నారు. ఇందుకు పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కార్యాలయంలోనే రాజీ : గతేడాది నవంబర్ 16న నాలుగు బైక్‌లతో కొందరు కలపను తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి బైక్‌ను మాత్రమే స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించి మిగిలిన మూడు వాహనాలను వదిలేసినట్టు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పట్టుబడిన వ్యక్తి మరికొందరితో కలిసి వెళ్లి రేంజ్ కార్యాలయంలో వాగ్వాదానికి కూడా దిగాడు. అధికారులు మిగిలిన వాహనాలపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారే తప్ప అ మలు కాలేదు. పట్టుబడిన వ్యక్తి గొడవకు దిగడంతో అధికారులే రాజీ కుదిర్చారు. పట్టుబడిన మో టార్ సైకిల్‌కు బదులు పనిచేయని మరో బైక్‌ను సీజ్ చేసి అసలు వాహనాన్ని అక్రమార్కుడికి తిరిగి ఇచ్చేశారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 20న మో టార్ బైక్‌లపై తరలిస్తున్న కలపను డీఆర్వో ప ట్టుకుని సెల్ఫీ కూడా తీశారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు కాలేదు.
పెద్ద ఎత్తున తరలింపు
అక్రమార్కులు సిండికేట్‌గా వ్యవహరిస్తూ పలు బీట్లలో చెట్టను నరికి కలప తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అతి విలువైన వృక్షజాతికి చెందిన దుంగలను రవాణా చేసి రూ.20 లక్షలకు పైగా దండుకున్నారు. సమాచారం అందుతున్న సమయాల్లో స్క్వాడ్ సిబ్బందికి దొరుకుతున్న అక్రమ కలప, వాహనాలు.. రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దొరక్కపోవడం గమనార్హం. నెల రోజుల వ్యవధిలో పదికి పైగా కలప తరలిస్తున్న ఫోర్ వీలర్స్ వాహనాలను స్క్వాడ్ బృందం పట్టుకోవడం మినహా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఎలాంటి వాహనాలను పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అడవికి అన్యాయం
కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి జాఢ్యం
అటవీ కలపను యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమార్కులు
అక్రమ రవాణాకు అధికారుల సహకారంపై ఆరోపణలు
రూ.3 లక్షలకు పైనే నెలవారీ మామూళ్లు
ఉన్నతాధికారుల వద్ద ఉన్న పలుకుబడితో కార్యాలయంలోని ఓ అధికారి మొత్తం కలప అక్రమ రవాణా కు ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కార్యాలయానికి సంబంధించి ఉన్నతాధికారిని నియమించాల్సి ఉన్నా దానిని నిలుపుదల చేయిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు రేంజ్ అధికారులు కన్నాపురం కార్యాలయానికి బదిలీపై రావాల్సి ఉన్నా సదరు అధికారి ఆ ప్రక్రియను ఆపడానికి వెనకాడలేదని తెలిసింది. కలప అక్రమ రవాణాకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెనుకటి తేదీలతో కేసులు నమోదు చేసినట్టు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారులను కూడా వీరే ఎంపిక చేసుకుని వారి ద్వారా 50 కిలోమీటర్లలోపు కలప అక్రమ రవాణా అయ్యేలా చూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమాలకు అండగా.. అవినీతి మెండుగా..!


