కోకో ధర తగ్గింపు అన్యాయం
పెదవేగి: కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర లు తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్ చేసింది. శనివారం విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కల్యాణ మండలపంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ధర నిర్ణయంపై ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో తీసుకోవాల్సిన చర్య లు గురించి చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో కంపెనీలు ధరలు ఎలా తగ్గిస్తాయని ప్రశ్నించారు. కిలో గింజలకు ధరను రూ.400 నుంచి రూ.380కు తగ్గించారని, దీనిపై ప్రశ్నిస్తే అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని చెప్పడం అన్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో జనవరిలో రూ.550 ధర ఉంటే రూ.350లకే కొనుగోలు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా రైతులకు ధరలు చెల్లించడం లేదన్నారు. ధరలు తగ్గించడం సరికాదని దీనిపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు భ విష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు, పాలడుగుల నరసింహారావు, నాయకులు బొప్పన పూర్ణచంద్రరావు, కూరపాటి ధర్మారావు, బొప్పన శివరాం పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కు మార్చినట్టు పేర్కొన్నారు. 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉన్నందున ఈ మార్పు చేసినట్టు స్పష్టం చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 639 మందికి 233 మంది, 11వ తరగతిలో ప్రవేశాలకు 677 మందికి 151 మంది హాజరయ్యారన్నారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు కేంద్రాలను సందర్శించారని తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉచితంగా ప్రవేశాల నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు 1వ తరగతిలో ప్రవేశాలను అందిస్తామన్నారు. ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల దరఖాస్తులను సంబంధిత గ్రామ సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం లేదా సంబంధిత పాఠశాల ద్వారా సమర్పి ంచవచ్చన్నారు. దరఖాస్తు చేసే పిల్లలు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు ఏలూరులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సీఎంఓ, ఏఎస్‌ఓలను సంప్రదించవచ్చన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్–2026 అమలుచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా నిబంధనలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల భద్రతకు ముప్పుగా పరిణమించనున్నాయని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఈ. రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని రాష్ట్రంలోని 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం కోరిందని, ఈ నిబంధనలు తీవ్రనష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ట్రార్డినరీ లీవ్, 33 ఏళ్ల సేవ పూర్తయితే బలవంతపు రిటైర్‌మెంట్ వంటి పలు నిబంధనలు ప్రమాదకంగా ఉన్నాయని తెలిపారు.


