ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
కలెక్టర్ నాగరాణి
భీమవరం: వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. భీమవరం టౌన్‌హాల్‌లో శుక్రవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన హార్టికల్చర్ కాన్‌క్లేవ్–2026 సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక పద్ధతుల్లో అధిక విలువ గల కూరగాయలు, పూల రక్షిత సాగు, కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీ, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఉద్యాన పంటల మార్పిడిపై దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుకు అనుకూల వాతావరణం జిల్లాలో ఉందన్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. ఉద్యాన శాఖ డీడీ జి.ప్రభా కర్ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్ర సాద్, ఉద్యాన శాఖ అధికారి పి.శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


