మృతదేహంతో ధర్నా
ఉండి: సుమారు మూడు నెలల క్రితం ఒమన్ దేశంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహంతో ఆదివారం కుటుంబీకులు ఏజెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి కుమార్తె వివరాల ప్రకారం నర్సాపురం మండలం చిట్టవరానికి చెందిన పిట్ట రాజమణిని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ విమల ఒమన్‌కు పంపించింది. వెళ్ళినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆమె మృతి చెందింది. తన తల్లి మరణించినట్లు ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిందని మృతదేహాన్ని తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సాయంతో తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు.
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో విజయవాడ – నరసాపురం రూట్‌లో శైవ క్షేత్రాలను సందర్శించే యాత్రకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారులో ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్ట్రార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి వీక్షించారు.
భీమడోలు: మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకాతిరుమలకు చెందిన చీమకుర్తి జ్యోతికృష్ణ గణపతి(50) శనివారం రాత్రి భీమడోలు రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి మృతి చెందాడు. జ్యోతికృష్ణ గణపతి ఆలయం వద్ద దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో ఇంట్లో ఎవరి చెప్పకుండా శనివారం సాయంత్రం బయటకు వచ్చేసాడు. భీమడోలు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పట్టెంపాలెం వై.జంక్షన్‌లో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు. హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆకివీడు: పాత కక్షల నేపథ్యంలో ఆదివారం స్థానిక సంతపేట వద్ద ఇరువర్గాలు దాడికి పాల్పడిన ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. స్థానిక సాలిపేటకు చెందిన చుండూరు సాయిబాబు అతని స్నేహితులు పోలిశెట్టి చక్రధరరావు, గోపిశెట్టి ప్రసన్నకుమార్ సంతమార్కెట్‌లోని రామాలయం వద్ద కూర్చుని మాట్లాడుకొంటుండగా బొట్టా చైతన్య, మోహన్ వచ్చి తిట్టారు. ఎందుకు తిడుతున్నారని అడిగినందుకు ఇటుక రాయితోనూ, బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ప్రసన్నకుమార్, సాయిబాబు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు.
కుక్కునూరు: అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం మండలంలోని గుండేటివాగు సమీపంలో జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన సోడే సంకురు(40) మృతదేహం గుండేటివాగు సమీపంలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
మృతదేహంతో ధర్నా
మృతదేహంతో ధర్నా


