ప్రసాదాల తయారీ టెండర్ రద్దుకు నిర్ణయం
ద్వారకాతిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ టెండర్‌ను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. మొత్తం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో సరైన పత్రాలు సమర్పించని కారణంగా టెక్నికల్ బిడ్‌లో మూడు టెండర్లను డిస్ క్వాలిఫై చేశారు. ప్రైజ్ బిడ్ ఓపెన్ చేయాలంటే కనీసం రెండు టెండర్లు ఉండాలి. సింగిల్ టెండర్ ఉండటంతో పూర్తిగా టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని అధికారుల కమిటీ నిర్ణయించి, నివేదికను ఆలయ ఈఓకు సమర్పించింది. నిబంధనల ప్రకారం సరైన పత్రాలు సమర్పించని కారణంగా విజయవాడకు చెందిన ఎం.విజయచంద్ సప్లయర్స్, ఎం.రవికుమార్, జీకే మ్యాన్ పవర్ టెండర్లను కమిటీ డిస్ క్వాలిఫై చేసింది. ద్వారకాతిరుమలకు చెందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్ టెండర్ ప్రైజ్ బిడ్‌కు అర్హత పొందింది. అధికారులు పారదర్శకంగా టెండర్ ప్రక్రియను నిర్వహించడంతో ముగ్గురు కాంట్రాక్టర్లు డిస్ క్వాలిఫై అయ్యారు. కొత్త టెండర్ ప్రక్రియలో అర్హత పొందిన రవికృష్ణ మ్యాన్ పవర్ ఏజన్సీస్‌పై, అంబరుఖానా అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు, ఆలయ ఛైర్మన్, ఈఓలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 8న వాట్సప్‌ల ద్వారా మెసేజ్‌లు పంపారు. ఆ ఆరోపణలు అవాస్తవమని అధికారులు తమ విచారణలో తేల్చారు. దేవస్థానం అధికారులు మళ్లీ కొత్తగా పిలిచే టెండర్‌లో, ప్రస్తుతం ఉన్న షరతులే ఉంచుతారా.. లేక అధికార పార్టీ నాయకుల కోసం వాటిని సడలిస్తారా.. అన్న దానిపై శ్రీవారి క్షేత్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.


