వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారుగొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంటి తలుపులు కొట్టిన శబ్ధం విని తలుపు తీసింది. ముఖానికి గుడ్డకట్టుకుని ఉన్న వ్యక్తి ఆమైపె దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, వృద్ధురాలి మెడలోని 2 కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీనిపై తడికలపూడి ఎస్సై టి.చెన్నారావు కేసు నమోదు చేశారు. సీఐ సుభాష్ ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో నిందితుడు కామవరపుకోట మండలం పాతూరుకు చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు. కామవరపుకోట చింతలపూడి వెళ్లే రోడ్‌లో ఆర్‌ఆర్‌జీకే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి, రూ.1.40లక్షలు విలువైన బంగారు గొలుసు, మోటార్‌సైకిల్, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కేసును చేధించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై టి.చెన్నారావు, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, పీసీలు ఎస్‌కే షాన్, ఎన్.రమేష్, ఎ.సుధీర్‌లను ఏఎస్పీ అభినందించారు.


