అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్టు
నరసాపురం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన మాన్యం వంశీ మణికంఠను శనివారం నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.14 లక్షలు విలువచేసే 21 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీవేద కేసు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటుపడిన మణికంఠ కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నెల 7న నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలో సర్రా శ్యాంబాబు ఇంటి గేటు తాళాలు పగులగొట్టి బైక్ దొంగతనం చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నరసాపురం సీఐ తనిఖీలు చేస్తుండగా పాలకొల్లు రోడ్డు వీరభవానీ గుడి వద్ద మణికంఠ అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించారు. నరసాపురం టౌన్‌లో 8 చోట్ల, తెలుగు రాష్ట్రాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్టు నిందితుడు అంగీకరించాడని చెప్పారు.


