భారీగా అక్రమ మద్యం ధ్వంసం
నరసాపురం రూరల్: అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హెచ్చరించారు. శుక్రవారం మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో రూ.24 లక్షల విలువైన మద్యం, సారాను ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఎస్పీ స్వయంగా రోడ్ రోలర్‌ను నడిపి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో సీజ్ చేసిన 4,550 బాటిళ్ల డ్యూటీ పెయిడ్ లిక్కర్ (డీపీఎల్), 2,136 బాటిళ్ల నాన్–డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్), 620 లీటర్ల అక్రమ సారాను వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, అదనపు ఎస్పీ వి.భీమారావు, నరసాపురం సబ్ డివిజన్ డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద తదితరులు పాల్గొన్నారు.


