గ్రామాల్లో అనధికార లే అవుట్లు
● పంచాయతీ అనుమతి లేకుండానే ఏర్పాటు
● ప్రభుత్వ ఆదాయానికి గండి
కాళ్ల: గ్రామాల్లో రియల్ వ్యాపారుల ఆగడాలు రో జురోజుకూ పెరిగిపోతున్నాయి. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా లోపాయికారి ఒప్పందాలతో లే అవుట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసా యేతర భూమిగా మార్చాలంటే అనుమతులు తప్పనిసరి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్వర్షన్ కూడా కట్టకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తున్నారు. అనంతరం భూమిని పూడ్చి లేఅవుట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలానే మండలంలోని దొడ్డనపూడిలో ఓ లే అవుట్‌ను ఏర్పాటుచేశారు. సెంటు రూ.లక్షల్లో ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయినా పంచాయతీ అధికారులు ఇటుగా కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. లే అవుట్‌కు అనుమతులు లేకపోతే కనీసం బోర్డు కూడా పెట్టకపోతే తమకు ఎలా తెలుస్తుందని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎ.పోలయ్యని వివరణ కోరగా గ్రామంలో ఎలాంటి లే అవుట్లకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అనధికార లేఅవుట్లలో స్థ లాలు కొని మోసపోవద్దన్నారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


