నో స్టాక్‌.. కార్డుదారులకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

నో స్టాక్‌.. కార్డుదారులకు షాక్‌

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

నో స్

నో స్టాక్‌.. కార్డుదారులకు షాక్‌

జిల్లాలో ఇలా..

రేషన్‌ షాపుల ముందు నోస్టాక్‌ బోర్డులు

గడువు ముగియక ముందే రేషన్‌ దుకాణాలు క్లోజ్‌

తాడేపల్లిగూడెం: రేషన్‌ షాపుల ముందు నోస్టాక్‌ బోర్డులు కార్డుదారులను వెక్కిరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షగట్టి ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలను నిలుపుదల చేయించి, రేషన్‌ షాపుల ముందు క్యూ వ్యవస్థను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే పేదలు తమ కోటా సరుకులను తెచ్చుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వెళ్లినా సరుకు లేదంటూ తిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలో చాలా రేషన్‌ షాపుల వద్ద మొదటి వారంలోనే నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే లెక్కల ప్రకారం కార్డుదారులందరికీ బియ్యం సరఫరా అవుతున్నట్టు అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే 15వ తేదీ సాయంత్రం వరకు ఇవ్వాల్సిన సరుకులు వారం ముందే అయిపోతున్నాయని, ఈ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమార్కులకు అడ్డా

ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలు రేషన్‌ మాఫియాకు అడ్డాగా ఉండేవి. ఇక్కడి నుంచే కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు బియ్యం తరలివెళ్లిపోయేవి. అయితే ఈ మాఫియా కొంతకాలం ఆగినా ఇటీవల కాలంలో మళ్లీ యాక్టివ్‌ అయ్యిందని సమాచారం. ఇటీవల కొందరు డీలర్లు రాజీనామా చేయడం, సస్పెండ్‌లు వంటి కారణంగా ఖాళీగా ఉన్న దుకాణాలను చేజిక్కించుకున్న డీలర్లు సరుకును అడ్డదారులకు పంపిస్తున్నట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో ఇద్దరు అధికారం ఉన్న వ్యక్తుల అండ చూసుకొని ఎరువుల గోదాములనే అక్రమ బియ్యం గోదాములుగా మార్చుకుని బియ్యాన్ని హద్దులు దాటిస్తున్నారు. అయితే విజిలెన్సు అధికారులు దాడులు తర్వాత కొంత ఆగినట్టు కనిపించినా, వెళ్లాల్సిన సరుకు దొడ్డిదారిన వెళుతోందని సమాచారం.

ఇన్‌చార్జిల ఇష్టారాజ్యం

ఇటీవల కాలంలో చౌక దుకాణాల ఖాళీలు వచ్చినా, ఇన్‌చార్జిలే నియామకమే తప్ప పూర్తిస్థాయిలో కొత్త డీలర్లను నియమించలేదు. ఇప్పటికే ఉన్న డీలర్లనే ఇన్‌చార్జిలుగా నియమిస్తూ ఉండడంతో రెండు మూడు దుకాణాలకు ఒకే డీలర్‌ గుప్పిట్లోనే ఉంటున్నాయి. దీంతో అక్రమ వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కొందరు రెవెన్యూ అధికారులు మ్యాపింగ్‌ పేరుతో కార్డులను హద్దులు దాటించి పట్టణంలో కార్డులను పల్లె డీలర్లకు, గ్రామ కార్డులను పట్టణంలోని రేషన్‌ దుకాణాలకు మ్యాపింగ్‌లో మార్చడంతో బియ్యం తెచ్చుకోవడం భారమై చాలా మంది సరుకులు తెచ్చుకోవడం లేదు.

జిల్లా వ్యాప్తంగా 551332 రేషన్‌ కార్డులున్నాయి. 1052 రేషన్‌ దుకాణాలున్నాయి. ఉన్న కార్డుదారులందరికి బియ్యం ఇవ్వాలి. కానీ ఏ నెలా కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉదాహరణకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో, తాడేలప్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం మండలం కలిపి మొత్తం 81 రేషన్‌ దుకాణాలున్నాయి. పెంటపాడు మండలంలో ఫిబ్రవరి కోటాగా 309 మెట్రిక్‌ టన్నుల బియ్యం, పది టన్నుల పంచదార వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 44 రేషన్‌ దుకాణాలున్నాయి. మండలంలో 37దుకాణాలున్నాయి. మొత్తం 55 వేల 800 మెట్రిక్‌ టన్నుల బియ్యం, పంచదార 23 టన్నులు, పట్టణంలో మాత్రం గోధుమపిండి 12 టన్నులు వచ్చింది. అయితే 12వ తేదీ నుంచే చాలా షాపుల వద్ద నోస్టాక్‌ బోర్డులు దర్శమిచ్చాయి. ఇప్పటికై నా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు స్పందించి రేషన్‌ను పూర్తి స్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నో స్టాక్‌.. కార్డుదారులకు షాక్‌ 1
1/1

నో స్టాక్‌.. కార్డుదారులకు షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement