నమో వేంకటేశా..
ద్వారకాతిరుమల: నమో వేంకటేశా.. అంటూ వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారిని దర్శించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దర్శనం క్యూలైన్లు, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆకివీడు నుంచి భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్న రామ భక్తులు మద్యలో శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. దాంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. వారంతా కాషాయ జెండాలను పట్టుకుని ఆలయంలోకి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించారు.
నమో వేంకటేశా..


