పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
● 15లోగా 50 శాతం పన్నులు వసూలు చేయాలని హుకుం
● లేదంటే సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారుల బెదిరింపులు
నరసాపురం: పంచాయతీ కార్యదర్శుల మెడపై పన్నుల వసూళ్ల కత్తి వేలాడుతోంది. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నులు ఈ నెల 15 లోగా 50 శాతం వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వచ్చే నెలలో గానీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాదు. ఏటా మార్చిలో పన్నుల వసూళ్లు ముమ్మరం చేసి ఏప్రిల్ నెలలో ముమ్మరంగా వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు దృష్టిపెడతారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకుండానే తమపై ఒత్తిడి ఏంటని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
50 శాతం వసూలు చేయకుంటే సస్పెండ్
15వ తేదీ కల్లా 50 శాతం పన్నులు వసూలు చేయకుంటే సస్పెండ్ చేస్తామనే హెచ్చరికలు అందాయి. పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడ్డ వారిలో మండలానికి ఒకరి చొప్పున కార్యదర్శులను గుర్తించి వారిని సస్పెండ్ చేయడం ద్వారా మిగిలిన సెక్రటరీలకు హెచ్చరికలు పంపించే దిశగా ఉన్నతాధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు తమపై కత్తిపెట్టారని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు .అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆ సొమ్ము సక్రంగా ఖర్చు చేయడం చేతకాక ముందస్తుగా పన్నులు వసూలు చేయమనడంపై బహిరంగగానే విమర్శిస్తున్నారు.
గత రెండేళ్ల నుంచి జేబులో పైసాలేకుండా ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఒత్తిడి చేసి పన్నులు ఎలా వసూలు చేస్తాం? అని ప్రశ్నిస్తునఆనరు. ఇప్పటికీ జిల్లాలో మొత్తం 20 శాతం కూడా వసూళ్లు జరగలేదు. మరోవైపు ప్రభుత్వ సూచనలతో అధికారులు పెట్టిన 50 శాతం పన్నుల వసూళ్ల డెడ్‌లైన్‌కు మరో నాలుగురోజులే గడువుంది. దీంతో చేసేదిలేక సెక్రటరీలు పన్నుల వసూళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్యదర్శుల వెతలు వర్ణనాతీతం.
కార్యదర్శులపై పెరిగిన పని ఒత్తిడి
పంచాయతీ కార్యదర్శులకు కేవలం పన్నుల వసూలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల పీ–4 సర్వే, కుల గణన, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ వంటివి నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సర్వేలలో నిమగ్నం కావాల్సి రావడం, మరో వైపు పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టడం చేస్తున్నారు. కొందరు బకాయిలకు రాజకీయ పలుకుబడి ఉండటంతో బలవంతంగా వసూలు చేయలేకపోతున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల కొరత ఉంది. పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఉన్నప్పటికీ, ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఆ భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శ్రీస్వర్ణ పంచాయతీ పోర్టల్ఙ్ ఆనన్‌లైన్ వ్యవస్థ ద్వారా పన్నుల చెల్లింపు చేయించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, సర్వర్ లోపాల వల్ల డేటా ఎంట్రీ ఇబ్బందిగా మారుతోంది. సంక్షేమ పథకాలు అందడంలో ఏమైనా జాప్యం జరిగితే గ్రామస్థులు పంచాయతీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య తిరిగి వారి వద్దకు వెళ్లి పన్నులు అడగడం పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందిగా మారింది.


