రొయ్య ధరలు పతనం
ఆక్వా సాధికారత కమిటీకి మంగళం
● 100 కౌంట్ రూ.270 నుంచి రూ.250కు పడిపోయిన వైనం
● అమెరికా సుంకాలు తగ్గినా రైతులకు దక్కని ఫలితం
అమెరికా టారిఫ్ 25 నుంచి 18 శాతానికి తగ్గించడంతో రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. దీనికి భిన్నంగా కౌంట్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకూ తగడం దారుణం. రొయ్యల ట్రేడర్స్, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలి
– కొరుపోలు అప్పారావు, ఆక్వా రైతు
ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు, వైరస్ ప్రభావం తగ్గలేదు. ప్రతికూల వాతావరణంతో తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో నిరంతరం ఏరియేటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. 100 కౌంటు ధర రూ.280 వద్ద నిలకడగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది.
– జె.రవీంద్ర, సీనియర్ ఆక్వా టెక్నీషియన్
నిడమర్రు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రొయ్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ సాగు గత కొంత కాలంగా వాతావరణ మార్పులతో వైరస్, నాణ్యమైన సీడ్ అందకపోవడం, మేతల ధరలు, పెట్టుబడులు పెరగడం, టారిఫ్‌ల పెరుగుదలతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోవడం వంటి కారణాలతో ఆక్వా సాగు రైతులు నేల చూపులు చూస్తున్నారు. గత రెండు రోజులుగా రొయ్య ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు తగ్గని వైరస్‌తో పోరాటం చేస్తున్న రైతులను ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు 100 కౌంట్ ధర రూ.270 ఉండగా బుధవారం నుంచి రూ.250కి పడిపోయింది. మిగిలిన కౌంట్ ధర రూ.20 నుంచి రూ.40 వరకూ తగ్గడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు చేయడంతో కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రొయ్య రైతులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించినా రొయ్య ధరలు పతనం అవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్య ధరలు, మేతల ధరలు నియంత్రించాల్సిన కూటమి సర్కారే సిండికేట్‌లకు కొమ్ము కాస్తోందని ఆక్వా రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. వీటిలో 90 శాతం పైగా వనామినే.
అమెరికా ప్రకటించిన రోజే రొయ్య ఽకౌంట్ ధరలు తగ్గడంపై ఆక్వా రైతులు నేల చూపులు చూస్తున్నారు. మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గతుండటం ఆక్వా సాగు రంగాన్ని కుదిపేస్తోంది. సాగు సమస్యలు ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో పట్టుబడులకు దిగిన రోజే ధరలు పడిపోవడంతో టన్ను రొయ్యకు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు.
ఽకూటమి ప్రభుత్వంలో గడ్డు పరిస్థితి
రొయ్య ధరల నియంత్రణలో కూటమి సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆక్వా రైతులు విమర్శిస్తున్నారు. రొయ్య ధరలు నియంత్రించలేక పోవడం, మేతల ధరలు కంపెనీలు పెంచుతున్నా వారిని అదుపు చేయలేక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి వారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించే పద్ధతిని కూటమి సర్కారు పక్కన పెట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. అమెరికా పెంచిన సుంకాల పేరుతో వ్యాపారులు రొయ్య ధరలు అప్పట్లో అమాంతం తగ్గించేశారు. పెరిగిన టారిఫ్ ప్రకటనతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో టారిఫ్‌లను చూపి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లు తగ్గించుకుంటూ పోతుండటంతో 100 కౌంట్ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారత కమిటీ, ప్రతివారం సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించి స్థిరీకరణ కోసం చర్యలు తీసుకునేది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ సాధికారత కమిటీకి మంగళం పాడింది. తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్ ప్లాంట్, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులతో ఆక్వా కమిటీ ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ రైతుల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుంది?
– పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే
రొయ్య ధరలు పతనం
రొయ్య ధరలు పతనం
రొయ్య ధరలు పతనం
రొయ్య ధరలు పతనం


