గేటు పడితే ట్రాఫిక్ కష్టాలు
భీమడోలు: జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న భీమడోలు రైల్వే గేటు మీదుగా వాహనాల రాకపోకలు వాహనదారులకు చుక్కలు చూపుతోంది. రైల్వే గేటును ఒక్కసారి మూస్తే భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. ఏలూరు నుంచి భీమడోలు వచ్చే వారు, తాడేపల్లిగూడెం నుంచి భీమడోలు వైపుగా వచ్చే వాహనాలు అడ్డుగా రావడం సమస్యగా మారింది. భీమడోలు నుంచి జాతీయ రహదారికి వచ్చే వాహనాలతో గేటు వద్ద రద్దీగా మారుతుంది. ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గేటు తెరిస్తే వాహనాలు వేగంగా దూసుకెళ్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది.
ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్
భీమడోలు రైల్వే గేట్‌లో రోజుకు పదుల సంఖ్యలో గేటు వేస్తున్నారు. ఈ గేటు మీదుగానే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తాయి. మెట్ట ప్రాంతాలకు, రాష్ట్రీయ రహదారి వైపు వెళ్లాలన్నా ప్రధాన మార్గం ఇదే. ఒక్కసారి వేసిన గేటు 2 నుంచి 3 రైళ్లు వెళ్లే వరకూ తీసే పరిస్థితి లేదు. దీంతో భారీ వాహనాలు, ద్విచక్రవాహనాలతో రద్దీ ఏర్పడుతుంది. గేటు వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ప్రాంతంలో ఫ్‌లై ఓవర్ వంతెన వేసి గేటు మూసి వేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రైల్వే ఫ్‌లై ఓవర్ బ్రిడ్డి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
గేటు పడితే ట్రాఫిక్ కష్టాలు


