అపచారం.. దురాచారం
● ఏలూరు గంగానమ్మ జాతరలో
నిర్వాహకుల తీరుపై విమర్శలు
● అడ్డగోలు వసూళ్లపై తీవ్ర ఆగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత అక్టోబర్ నెల నుంచి నగరంలో నిర్వహించిన శ్రీ గంగానమ్మ జాతర సందడి ముగిసింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన జాతరలో వివిధ కమిటీలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవార్ల దర్శనానికి టిక్కెట్లు పెట్టి భక్తులను దోచుకున్నారని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతర రోజున అమ్మవార్లకు జీవాలను చూపడానికి కూడా రూ.50 నుంచి రూ.500 వరకూ వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి తోడు అమ్మవారి ఘటాలను కొంతమంది భక్తుల ఇంటి వద్ద దింపి వారి ఇంట్లో భోజనాలకు ఏర్పాటు చేయడం కోసం కమిటీ ప్రతినిధులు సదరు భక్తుల నుంచి రూ. 5 వేల నుంచి రూ. 15 వేల వరకూ వసూలు చేశారని తెలుసుకుని కొంతమంది వృద్ధులు ఇదెక్కడి దురాచారమని మండిపడుతున్నారు. గతంలో అమ్మవారి ఘటాలను తలకు ఎత్తుకున్న అనంతరం ఊరంతా తిరిగే వరకూ కిందకు దింపే వారు కాదని, గంటకు ఒకరు చొప్పున డ్యూటీలు వేసుకుని ఒకరి తరువాత ఒకరు ఘటాలను దింపకుండా తిప్పుతూనే ఉండాలనేది సంప్రదాయంగా వస్తోందని, అయితే జాతర కమిటీల ప్రతినిధులు డబ్బుకు ఆశపడి భక్తుల ఇళ్ల వద్ద అమ్మవార్ల ఘటాలను దింపి వారి ఇంట్లోకి తీసుకువెళ్లడం సంప్రదాయానికి వ్యతిరేకమనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సంప్రదాయ వ్యతిరేక చర్యలు నగరానికి ఏమి అరిష్టాన్ని తెచ్చి పెడతాయో? అని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ స్థితికి నగరం
జాతర సందడి ఇప్పుడిప్పుడే నగరం సాధారణ స్థితికి చేరుకుంటుంది. నగరంలోని తూర్పు వీధి మొదలు తంగెళ్ళ మూడి వరకూ ఏడు ప్రాంతాల్లో శ్రీ గంగానమ్మ వారి జాతర సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లకు ముడుపు కట్టడం నుంచి అమ్మవార్ల పాదం భూమిపై మోపడం, అమ్మవారిని నగరంలోకి ఘనంగా స్వాగతించడం, అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం, అక్కడి నుంచి ప్రతీ నిత్యం అమ్మవార్లకు భక్తులు నైవేథ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం, నగరంలోని ప్రతి వీధిలో అమ్మవారిని ఊరేగించి అమ్మవార్ల దర్శనాన్ని ప్రజలకు కల్పించడం వంటి కార్యక్రమాలతో నాలుగు నెలల పాటు నగరంలో సందడి వాతావరణం నెలకొంది. గత నెల 26వ తేదీ నుంచి జాతర ముగింపు దశకు చేరుకుని ఈ నెల 9వ తేదీతో అమ్మవార్లను సాగనంపే ప్రక్రియ వరకూ అంతా సజావుగా సాగిపోయింది. శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర ముగిసినా ఇప్పటికీ నగరంలోని భక్తులు అమ్మవారి జాతర ముచ్చట్లే చెప్పుకుంటున్నారు. జాతర విశేషాలను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు విశేషంగా ప్రచారం చేయడంతో ఏలూరు నగరంలోనే కాక పరిసర ప్రాంతాల ప్రజలు సైతం జాతర విశేషాలపై ఎంతో ఆసక్తి కనబరిచారు.
ఉత్సాహంగా అన్న సమారాధనలు
నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్ పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, పడమర వీధి, తంగెళ్లమూడి ప్రాంతాల్లో జాతర ముగిసిన నేపథ్యంలో జాతర కమిటీల ప్రతినిధులు భారీ ఎత్తున అన్న సమారాధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తంగెళ్ళమూడి, దక్షిణపు వీధి కమిటీలు అన్న సమారాధన ముగించగా మరికొన్ని కమిటీల ప్రతినిధులు తాము త్వరలో అన్న సమారాధన నిర్వహిస్తామని ప్రచారం చేస్తున్నారు.


