హరహర మహాదేవ.. శంభో శంకర
పంచారామక్షేత్రాలకు భారీగా భక్తుల రాక
ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తాం
భీమవరం (ప్రకాశం చౌక్): మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న శివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవాదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలు, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానాల్లో 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు.
చురుగ్గా ఏర్పాట్లు
జిల్లాలోని పంచారామక్షేత్రాలు, ప్రముఖ శివాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, సెట్గింగ్‌లు, డెకరేషన్ల పనులు చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో దేవదాయ శాఖ, పోలీసులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖలతో ఉత్సవాలపై సమన్వయ మీటింగ్‌లు పూర్తి చేశారు.
13, 15 తేదీల్లో స్వామి వారి కల్యాణం
మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామి వారి కల్యాణ తంతు అద్భుతమైన ఘట్టం. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వారికి అందుబాటులో ఉన్న శివాలయాలకు చేరుకుంటారు. ఈనెల 13వ తేదీన ఆచంటలోని శ్రీరామేశ్వరస్వామి వారి కల్యాణం కాగా మిగిలిన శివాలయాల్లో ఈనెల 15వ తేదీన స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం రథోత్సవం, తెప్సోత్సం నిర్వహిస్తారు.
ప్రసిద్ధ ఆలయాలు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు అందుకునే ప్రముఖు శివక్షేత్రాలు ఇవి. భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి, భీమవరంలో భీమేశ్వర స్వామి, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామి, జుత్తిగ ఉమాసోమేశ్వరస్వామి, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, శివదేవుని చిక్కాలలో శివదేవస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి తదితర శివాలయాలు మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి.
ఉమాసోమేశ్వర స్వామి వారు
భీమవరంలో పంచారామక్షేత్రం
జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాల్లో 5 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు భారీగా భక్తులు వస్తుంటారు. రోజుకు 10 వేలు నుంచి 30 వేలమంది వరకు భక్తులు పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తారు. రధోత్సవాలు, తెప్పోత్సవాలు జరుపుతారు. అలాగే పలు సాంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడి ప్రత్యేకత. క్షేత్ర పాలకుడు శ్రీజనార్థన స్వామి వారు.
మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని పంచారామక్షేత్రాలతోపాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. భక్తులు రద్ధీగా ఉండే శివాలయాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం.
– వి.సూర్యప్రకాష్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి
13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో ఆధ్యాతిక శోభ
జిల్లాలోని రెండు పంచారామాలు, శివాలయాల్లో ఏర్పాట్లు
5 రోజులపాటు విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు
హరహర మహాదేవ.. శంభో శంకర
హరహర మహాదేవ.. శంభో శంకర


