అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
భీమవరం: అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాలకై ఐక్యంగా పోరాడుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డా.బీఆర్.అంబేద్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా ట్రంప్ సుంకాలు, యుద్దోన్మాదం, ప్రపంచ శాంతి, సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడారు. అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో అమెరికా సుంకాలు 5 శాతం మాత్రమే ఉండేవని, నేడు 18 శాతం పెంచిందన్నారు. ఇప్పటికే అమెరికా పేటెంట్ పేరుతో కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి దోచేస్తున్నారని గుర్తుచేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, దేశ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదిక పైకి వచ్చి మోడీని ప్రశ్నించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కొనాల భీమరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, అంకెం సీతారాం, బి.బలరాం, దండు శ్రీనివాసరాజు, మెంటే పార్థసారథి, బి.వాసుదేవరావు, కేతా గోపాలన్, కర్రినాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


