మహా ప్రసాదం.. వితరణకు సిద్ధం
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి 62 వార్షిక మహోత్స వాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నారు. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే సుమారు లక్ష మంది భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి కూరగాయ పండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు అన్నదానం కోసం అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర వస్తువులను గురువారం ఉదయమే అమ్మవారి ఆలయం వద్దకు చేర్చి గురువారం సాయంత్రం నుంచే వంటలను తయారు చేయడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుంచీ అన్నదానం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మావుళ్లమ్మకు మహా నైవేద్యం
శ్రీమావుళ్లమ్మ వారికి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజల నడుమ మహా నైవేద్యం సమర్పిస్తారు. పలు రకాల పిండి వంటలు, స్వీట్లు, పులిహోర ఇతర ప్రత్యేక ప్రసాదాలతో అమ్మవారికి మహానైవేద్యం సమర్పిస్తారు. అనంతరం అన్నదాన ప్రసాదం వితరణ ప్రారంభిస్తారు. చక్ర పొంగలి, పులిహోర, అన్నం, బంగాళదుంప కుర్మా, వంకాయ కూర, ఆవకాయ పచ్చడి, సాంబారు, పెరుగుతో భక్తులకు అన్నదానం చేస్తారు. వాటితో పాటు భక్తులు తీసుకువచ్చే పలు రకాల పిండి వంటలు, స్వీట్లు ఉంటాయి.
పోలీసు బందోబస్తు
అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది సేవలు అందించనున్నారు. భోజనం చేసే ప్రాంతాల వద్ద, జనం లోపలికి, బయటకు వెళ్లే మార్గాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
శ్రీధనలక్ష్మీ వారి అలంకరణ
అమ్మవారి 62 వార్షిక మహోత్సవాల్లో భాగంగా గురువారం మావుళ్లమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అమ్మవారి అలంకరణలో దర్శమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
నేడు మావుళ్లమ్మకు మహా నైవేద్యం సమర్పణ
లక్షమందికి అన్నసమారాధన
ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం
మహా ప్రసాదం.. వితరణకు సిద్ధం
మహా ప్రసాదం.. వితరణకు సిద్ధం


