అవమానం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
తాడేపల్లిగూడెం: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసచేయడంతో పాటు, అతని కుటుంబం చేసిన అవమానం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బండారు సురేష్ కుమార్, ఏలూరు జిల్లా మండవల్లి మండలం లోకుమూడిగరువు ప్రాంతానికి చెందిన తమ్మిరెడ్డి వసంత (22) విజయవాడలోని లింగయ ఇనిిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇద్దరికి ఏర్పడిన పరిచయం కాస్తా, ప్రేమగా మారింది. దీంతో వసంత దగ్గర నుంచి సురేష్‌కుమార్ రూ.లక్ష తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో ఈ నెల ఒకటో తేదీన వసంత గూడెం వచ్చి అతని ఇంటికి వెళ్లగా సురేష్ కుమార్, తల్లి సూర్యప్రభ ఆమెను దుర్భాషలాడుతూ కొట్టారు. దీంతో అవమానం తట్టుకోలేక వసంత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దీనిపై వసంత సోదరి స్వప్న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఇన్‌చార్జి సీఐ బీబీ రవికుమార్ పర్యవేక్షణలో ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


