విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..
చివరగా ఆయన ఇచ్చిన సందేశం
● ఆర్‌ఎంవో డాక్టర్ తాతారావు గుండెపోటుతో మృతి
● శోకసంద్రంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్య సిబ్బంది
తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ అందే వెంకట రమా సత్య తాతారావు (56) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన ఓపీలో రోగులకు వైద్యసేవలందించారు. అనంతరం వైద్య సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అనంతరం గుండెల్లో కొంచెం మంటగా ఉందంటూ ఆస్పత్రిలో ఈసీజీ తీయించుకుని నార్మల్‌గా ఉందని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లిపోతానని నిడదవోలుకు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఉండ్రాజవరం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోని పిల్లకాలువ పక్కకు వెళ్లి నిలిచిపోయింది. స్థానికులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కిందకు దించి సీపీఆర్ చేసి అక్కడ నుంచి నేరుగా ఆయన్ను తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు. గతేడాది జూన్‌లో సాధారణ బదిలీల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయన తణుకు ఆర్‌ఎంఓగా విధుల్లో చేరారు.
శోకసంద్రంలో ఆస్పత్రి వర్గాలు
తాతారావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక ఆస్పత్రి వర్గాలు శోకసంద్రంలో నిలిచారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని వైద్యవర్గాలు సందర్శించాయి. తాడేపల్లిగూడెం ఆర్టీవో కౌసర్ భానో ఆస్పత్రికి వచ్చి తాతారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్‌తోపాటు తహసీల్దార్ దండు అశోక్‌వర్మ, వైద్యులు, సిబ్బంది డాక్టర్ తాతారావుకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు నిడదవోలులోని ఆయన నివాసానికి తాతారావు భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తరలించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలోను, చిన్న కుమార్తె వైజాగ్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యనభ్యసిస్తున్నారు.
ఆస్పత్రికి వెళ్దామన్నా వద్దన్న వైనం
తణుకులో కార్డియాలజిస్ట్‌కు చూపించుదామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ పట్టుబట్టినా.. మా డాక్టరు దగ్గరకు వెళ్తానని బలవంతంగా బయలుదేరినట్లుగా ఆస్పత్రి వైదులు చెబుతున్నారు. గతంలోనే గుండెకు రెండు స్టంట్స్ పడటంతో అశ్రద్ధ వద్దని అన్నా వినలేదని వాపోయారు.
‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఆస్పత్రికి వచ్చే రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు విలువైన వైద్యం సత్వరమే అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వైద్యసేవలో అప్రమత్తంగా ఉండాలి.’ బుధవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన ఇచ్చిన చివరి సందేశం.
విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..


