సాక్షి, అమరావతి: ‘మీకు చెప్పాలా..?’ అనే ఒక చిన్న పదబంధంతో చిన్న స్థాయి క్రమశిక్షణాపరమైన శిక్షకు (సెస్సూర్) గురై పదోన్నతి కోల్పోయిన ఒక మహిళా డిప్యూటీ తహసీల్దార్ న్యాయపోరాటంలో విజయం సాధించిన వైనమిది. ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నపాటి ఆరోపణల ఆధారంగా విధించే క్రమశిక్షణా చర్యల విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..
ఆర్‌టీఐ చట్టం కింద సమాచారం కోరిన 77 ఏళ్ల వృద్ధుడు డి. ప్రభాకర్‌రావుతో మాట్లాడేటప్పుడు ‘మీకు చెప్పాలా?’ అని అమర్యాదగా ప్రవర్తించారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ మాలతికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సెస్సూర్ శిక్షను విధించారు. ఈ శిక్ష కారణంగా మాలతి తహసీల్దార్ పదోన్నతిని కోల్పోయారు. ఆమెకన్నా సీనియారిటీలో వెనుకబడి ఉన్న 16 మందికి మాత్రం తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది.
ఈ అంశంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మాలతి సమాచారం ఇవ్వడానికి నిరాకరించలేదని, కేవలం సాధారణ స్థానిక భాషలో ఉపయోగించే పదబంధాన్ని అమర్యాదగా పరిగణించి శిక్షించడం సమంజసం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. సెస్సూర్‌ను రద్దు చేసి, సీనియారిటీ మేరకు సదరు ఉద్యోగిని పేరును పదోన్నతికి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. 1997లో జారీ చేసిన జీవో 53 ప్రకారం సెస్సూర్ శిక్ష పడిన ఉద్యోగికి ఒక సంవత్సరం పాటు పదోన్నతి పొందే అర్హత ఉండదన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.


