పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు.. సజ్జనార్‌ | Hyderabad Police Alert Over Rising Domestic Help Theft Cases | Sakshi
Sakshi News home page

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు.. సజ్జనార్‌

Jul 26 2026 1:53 PM | Updated on Jul 26 2026 2:53 PM

Hyderabad Police Alert Over Rising Domestic Help Theft Cases

పనిమనుషుల దొంగతనాలు పెరుగుతుండటంతో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేస్తోంది. పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే నిర్లక్ష్యమే ఈ దొంగతనాలకు ప్రధాన కారణమని చెబుతోంది. తగిన విచారణ లేకుండా పనిలో కుదుర్చుకుంటే విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనుల ఒత్తిడిలో ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే విద్యార్థులు, వృద్ధులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు.

ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొంద‌రు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానులు చూపే ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతోందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి పట్టుకోవడం కంటే, అసలు నేరమే జరగకుండా ఆపడమే అత్యంత ముఖ్యమని భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆఫీస్లు, దుకాణాలకు వెళ్లి యజమానులను నేరుగా కలిసి అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేళ్లలో నగరంలో నమోదైన 565 పనిమనుషుల దొంగతనం కేసులను (65 గ్రేవ్ కేసులు, 500 నాన్ గ్రేవ్ కేసులు) విశ్లేషించిన పోలీసులు... ప్రతి యజమాని తక్షణమే భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జోన్ల వారీగా పరిణామాలు పరిశీలిస్తే ఐటీ సంస్థలు, వ్యాపార వర్గాలు, ఉన్నత నివాస ప్రాంగణాలు, ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆఫీసుల్లో, దుకాణాల్లో, ఇళ్లలో యజమానులు బిజీ జీవనశైలి కారణంగా తగిన ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నట్లు తేలింది. మొత్తం 565 కేసుల్లో.. జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్ జోన్‌లో 88, ఖైరతాబాద్ జోన్‌లో 77, గొల్కొండ జోన్‌లో 70, రాజేంద్రనగర్ జోన్‌లో 63, శంషాబాద్ జోన్‌లో 49, చార్మినార్ జోన్‌లో 45 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ఇతర దేశాలు, రాష్ట్రాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల అవతారంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో తగిన గుర్తింపు, పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు లేని అపరిచిత వ్యక్తులను పనిలో చేర్చుకోవద్దని పోలీసు యంత్రాంగం స్పష్టంగా సూచిస్తోంది. నమ్మకంగా పనిలో చేరిన కొత్తలో యజమానుల అలవాట్లు, తాళాలు ఉంచే ప్రదేశాలు, సీసీ కెమెరాల కదలికలు, నగదు-నగల వివరాలను గమనించి నేరాలకు పాల్పడుతున్నందున, పూర్వాపరాలు తెలియని వారిని ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలకు రానివ్వకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. ఇళ్లు, ఆఫీస్, దుకాణాల్లోని లోపలి సమాచారం సురక్షితంగా ఉన్నంత వరకు నేరాలకు తావుండదనే ప్రాథమిక సూత్రాన్ని ప్రతి నగరవాసి గుర్తించి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

పాటించాల్సిన భద్రతా మార్గదర్శకాలు
ప్రజా భద్రతను పటిష్ఠం చేసే క్రమంలో సిటీ పోలీస్ యంత్రాంగం పలు ముఖ్యమైన సూచనలను ప్రజల ముందుకు తెచ్చింది. ఎవరినైనా ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో పనికి కుదుర్చుకునే ముందే వారి ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు నకలు, తాజా ఫోటో, శాశ్వత చిరునామా, స్వగ్రామం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచిస్తోంది. ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు, సదరు ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని, గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలని పేర్కొంటోంది.

 నియామకానికి ముందే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉచితంగా లభించే 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవడం భద్రతా పరంగా శ్రేయస్కరమని, పనిచేసే వ్యక్తులు తమ వెంట గుర్తింపు కార్డు లేదా వెరిఫికేషన్ పత్రాన్ని ఉంచుకునేలా యజమానులే చొరవ తీసుకోవాలని కోరుతోంది. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి అలవాట్లు, కదలికలను నిశితంగా గమనించడం ద్వారా ఎలాంటి అనుమానాస్పద చర్యలనైనా ముందే గుర్తించవచ్చని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, తరచుగా ప్రయాణాలు చేసే కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించకుండా జాగ్రత్త పడాలని కోరుతోంది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం తమ ప్రాంగణాల్లో ఇళ్లలో పనిచేసే పనిమనుషులకు ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహిస్తూ ప్రవేశ పాస్‌లు ఇవ్వాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచిస్తోంది.

నగర ప్రజల భద్రతపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పందిస్తూ... "నేర రహిత, సురక్షిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకం. నేరస్థుడికి బలవంతంగా లోపలికి వచ్చే ప్రవేశం ఉండదు... మనం ఇచ్చే అవకాశమే నేరానికి దారితీస్తుంది. పనిమనుషుల నియామకం విషయంలో ప్రతీ ఒక్కరూ సమగ్ర వివరాలు సేకరించి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పని మనుషుల దొంగతనాలు పెరుగుతున్న దృష్ట్యా, ముందస్తు పోలీస్ తనిఖీలు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో చేర్చుకోవద్దు. వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి." అని స్పష్టం చేశారు.

 నివాసాలు, ఆఫీస్లు, దుఖాణాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా, తాళం చెవులు పోయినా లేదా పనిమనిషి చెప్పకుండా మాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దన్నారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి గానీ, లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94906 16555 కు గానీ సమాచారం అందించాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement