సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆవరణలో రోడ్డుపై ఓఎంఆర్ షీట్లు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవడంతో టీజీపీఎస్సీ తక్షణమే స్పందించి పూర్తి వివరణ ఇచ్చింది.
రోడ్డుపై దర్శనమిచ్చిన ఓఎంఆర్ షీట్లు ప్రస్తుత పరీక్షలకు సంబంధించినవి కావని, అవి 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు చెందినవని కమిషన్ స్పష్టం చేసింది. ఆ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎప్పుడో విజయవంతంగా పూర్తయిందని వెల్లడించింది. సాధారణంగా పరీక్షలు ముగిసి మూడేళ్లు దాటిన ఓఎంఆర్ షీట్లను నిబంధనల ప్రకారం ష్రెడ్డింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేస్తామని, ఈ క్రమంలోనే పాత షీట్లు బయటకు వచ్చి ఉంటాయని పేర్కొంది.
అయినప్పటికీ, భద్రతా వలయాన్ని దాటి పబ్లిక్ ప్లేస్‌లోకి ఈ పాత ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయనే అంశంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


