breaking news
hire busses
-
అద్దె బస్సులపై అమాత్యుల వద్దకు..!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీలో ప్రైవేటు అద్దె బస్సులను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే అద్దె బస్సులు తిప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే మన అద్దె బస్సులు ఉండవు. ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం వెలువడేలోపే మనం మేల్కోవాల్సి ఉంది. ప్రభుత్వంలో గట్టి పట్టున్న ముగ్గురు, నలుగురు మంత్రులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన అద్దె బస్సులు కొనసాగేలా చూడాలి. ఇది జరగాలంటే కొంత మొత్తం ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అద్దె బస్సు నిర్వాహకులు తలా రూ.లక్ష చొప్పున చెల్లించాలి..’.. కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సమావేశంలో జరిగిన చర్చ ఇది. సమావేశం వివరాలు బయటకు పొక్కనప్పటికీ, అందుకు సంబంధించిన వీడియో ఒకటి నేరుగా ఆర్టీసీ ఎండీకి చేరింది. దీంతో ఆ అంశం ఆర్టీసీలో పెద్ద చర్చకు దారితీసింది. మంత్రుల పేర్లను ప్రస్తావించటంతో, దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అద్దె బస్సు యజమానులను పరోక్షంగా హెచ్చరిస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. మహిళా సంఘాల ఎంట్రీతో ముప్పు! ఆర్టీసీలో చాలా కాలంగా అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల అవసరాలకు కావాల్సినన్ని బస్సులను సొంతంగా సమకూర్చుకోవటం ఆర్టీసీకి తీవ్ర భారంగా పరిణమిస్తోంది. దీంతో కొన్నింటిని ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుని నడిపించే పద్ధతిని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించింది. అప్పటినుంచి క్రమంగా వీటి సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం 3 వేలకు పైగా అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఇవి కాకుండా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా అద్దె ప్రాతిపదికన తీసుకున్నవే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) బస్సులు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో మహిళా సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తున్నాయి. ఆ బస్సులకు ఆర్టీసీ ప్రతినెలా అద్దె చెల్లిస్తోంది. అలా ప్రస్తుతం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 553 బస్సులు తిరుగుతుండగా, మరో 27 బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ఆ సంఖ్య 600కు చేరనుంది. క్రమంగా ఈ సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైతే అన్ని అద్దె బస్సులను మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలోనే తిప్పితే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ బస్సులను ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా దీనికి బలం చేకూర్చేదిలా ఉంది. అది జరగాలంటే ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న అద్దె బస్సులు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అద్దె బస్సుల యజమానుల్లో కలకలం ప్రారంభమైంది. మరోవైపు ఇటీవల కొన్ని ప్రైవేటు అద్దె బస్సుల కాంట్రాక్టు గడువు పూర్తయింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు పిలవాలా, లేక మహిళా సంఘాలకు కేటాయిస్తారా స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అద్దె బస్సు నిర్వాహకుల్లో టెన్షన్ మరింత పెరిగింది. దీంతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునే క్రమంలో ఈ వివాదం వెలుగు చూసింది. ఎవరూ డబ్బులు చెల్లించొద్దు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తాజా ఉదంతంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ‘అద్దె బస్సుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. అధికారికంగా ఆర్టీసీ చేసే ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు దళారులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే మాటలు నమ్మి అద్దె బస్సు యజమానులు ఆందోళనకు గురికావొద్దు. రకరకాల కారణాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారి మాటలు నమ్మొద్దు. డబ్బులు ఎవరికీ చెల్లించొద్దు..’ అని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆర్టీసీ ఖజానాకు అద్దె బస్సుల కన్నం
ఐదేళ్లు దాటిన బస్సులకు అద్దె తగ్గించి చెల్లించే నిబంధనకు నీళ్లు అక్రమంగా అదనపు చెల్లింపులు వరంగల్ జిల్లాలో ఒకే డిపోలో రూ.10 లక్షలకు పైగా స్వాహ.. ప్రధాన కార్యాలయం టెస్‌ఆడిట్‌లో వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన డబ్బులను అద్దె బస్సులు మింగేస్తున్నాయి. ఆ బస్సులకు అందాల్సిన అసలు అద్దె అందినా, అక్రమంగా మరింత మొత్తాన్ని పొందుతున్నాయి. నయా పైసా కూడా స్వాహా కాకుండా ఆర్టీసీలో అంచెలవారీ నిఘా వ్యవస్థ ఉన్నా పైసలకు కాళ్లొస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం చూసి ఆర్టీసీ ఉన్నతాధికారులే షాక్‌కు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమై అలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బస్సుల నిండా జనం ఉన్నా ఆర్టీసీకి నష్టాలు వస్తుండడం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. ప్రపంచంలో మరే రవాణా సంస్థకు లేనన్ని బస్సులు నడుపుతున్న ఆర్టీసీ నష్టాలు ఊబిలో నిండా మునగడానికి ఇలాంటి ఉదంతాలు కూడా కారణమవుతున్నాయని స్పష్టమవుతోంది. ఇదీ సంగతి... ఆర్టీసీ తన అవసరాలకు తగ్గట్టుగా బస్సులు కొనే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని తిప్పుతోంది. ప్రస్తుతం 1200కు పైగా బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంది. పక్షం రోజులకోసారి ఈ బస్సులకు బిల్లులు చెల్లిస్తోంది. ప్రతి బస్సు కండిషన్‌గా ఉండడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం వరుసగా ఐదేళ్లపాటు తిరిగిన బస్సును ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి వస్తే దాన్ని బాడీ సహా పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధన విధించింది. ఆ బస్సుకు అప్పటివరకు చెల్లిస్తున్న అద్దె కూడా తగ్గిస్తారు. అది తిరిగే దూరాన్ని బట్టే అద్దె నిర్దారిస్తారు. ఐదేళ్ల తర్వాత కొనసాగే బస్సుకు... ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే కిలోమీటరుకు 99 పైసలు చొప్పున తగ్గించి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబు చోటుచేసుకుంటోంది. ఈ నిబంధనను తుంగలో తొక్కి ఐదేళ్లు నడిచిన బస్సుకు కూడా పూర్తి అద్దె చెల్లిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా తొర్రూరు డిపో పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. ఐదేళ్ల గడువు తీరిన కొన్ని బస్సులకు మొత్తం అద్దె చెల్లించినట్టు తేలింది. ఇవ్వాల్సిన మొత్తం కంటే దాదాపు రూ.10.86 లక్షల మేర అదనంగా చెల్లించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉండే ఆర్టీసీ టెస్ట్ ఆడిట్ విభాగం ఈ విషయాన్ని గుర్తించింది. పది బస్సులకు సంబంధించి అదనంగా చెల్లింపులు జరిగినట్టు తేలడంతో గతుక్కుమన్న ఆ డిపో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆ బస్సు యజమానులను పిలిపించి... అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. దీంతో ఇలాంటి వ్యవహారాలు మిగతా జిల్లాల్లో కూడా జరిగి ఉంటాయని అనుమానిస్తున్న ఉన్నతాధికారులు వెంటనే కేంద్ర ఆడిట్ విభాగాన్ని రంగంలోకి దించారు. తొలుత వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల్లో సోదాలు చేస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం అద్దె బస్సులకు అక్రమంగా బిల్లులు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వరంగల్ జిల్లా తొర్రూరు డిపో ఉదంతంలో సిబ్బంది తీవ్రమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. నిఘా వ్యవస్థ ఉండికూడా రూ.లక్షలు దారిమళ్లడం ఆశ్చర్యంగా ఉంది. దీనిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగాయేమో తెలుసుకునేందుకు మా టెస్ ఆడిట్ విభాగం రంగంలోకి దిగింది. రమణరావు, జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, టీఎస్ఆర్టీసీ


