జవాబు పత్రాలు 'భద్రమేనా'? | TGPSC orders inquiry into HWO OMR documents | Sakshi
Sakshi News home page

జవాబు పత్రాలు 'భద్రమేనా'?

Jul 27 2026 3:25 AM | Updated on Jul 27 2026 3:25 AM

TGPSC orders inquiry into HWO OMR documents

అభ్యర్థులు, నిరుద్యోగుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు 

రోడ్డుపై టీజీపీఎస్సీ ఓఎంఆర్‌ షీట్లు కన్పించడంతో కలకలం 

కేవలం హెచ్‌డబ్ల్యూఓ పత్రాలే బయటకొచ్చాయా? లేక వేరేవి కూడానా? 

హెచ్‌డబ్ల్యూఓ ఓఎంఆర్‌ పత్రాలపై విచారణకు ఆదేశించిన టీజీపీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) నిర్వహించే అర్హత పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత నిర్దిష్ట కాలవ్యవధి వరకు వాటిని భద్రపరిచి ఆ తర్వాత వాటిని ష్రెడ్డింగ్‌ (చిన్నముక్కలుగా కట్‌ చేయడం) చేయాల్సిన వాటిని రోడ్డు పక్కన చెత్త మాదిరిగా పారబోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లి సమీపంలో వేలాది ఓఎంఆర్‌ షీట్లు రోడ్డుపై కనిపించాయి. ఈ అంశంపై ఆదివారం సాక్షి ప్రధాన సంచికలో ‘రోడ్డుపై ఓఎంఆర్‌ షీట్ల కలకలం’ అనే శీర్షికతో వార్త కూడా ప్రచురితమైంది. ఈ ఓఎంఆర్‌ షీట్లు హాస్టల్‌ సంక్షేమ అధికారి పరీక్షలకు సంబంధించినవని టీజీపీఎస్సీ వెల్లడించింది. అయితే ఈ ఘటనపై నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా? అవి కూడా చిత్తు కాగితాల్లా రోడ్లెక్కాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓఎంఆర్‌ షీట్లు ప్రజాక్షేత్రంలోకి రావడంపై టీజీపీఎస్సీ అధికారుల నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిర్ణీత పద్ధతిలో... 
సాధారణంగా ఉద్యోగ నియామక సంస్థలు జవాబు పత్రాలను అత్యంత పకడ్బందీగా నిర్ణీత పద్ధతిలో ష్రెడ్డింగ్‌ చేస్తాయి. అప్పటివరకు వాటిని అత్యంత భద్రంగా, గోప్యంగా దాచి ఉంచాలి. నియామకాల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. కోర్టు కేసులు, ఇతర కారణాలతో వాటిని తిరిగి పరిశీలించాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా బయటకు తీయాలి. అయితే టీజీపీఎస్సీ ఈ పద్ధతులు అనుసరిస్తోందా? అనేది ఇప్పుడు ఉద్యోగార్థులు, నిరుద్యోగుల్లో నెలకొన్న ప్రధాన సందేహం. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పరీక్షల జవాబు పత్రాలు రోడ్లపైకి రావడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో అత్యధికంగా టీజీపీఎస్సీ ద్వారా చేసినవే ఉన్నాయి. అత్యంత కీలకమైన గ్రూప్‌–1 ఉద్యోగాలతో పాటు గ్రూప్‌–2,3,4 పరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షలు దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇవిగాకుండా ఇతర కేటగిరీల్లోనూ ఉద్యోగ అర్హత పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించింది. వీటన్నిటికీ సంబంధించిన జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా? లేవా? అనే సందేహాలు తాజా పరిస్థితుల నేపథ్యంలో నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. 

ఆ పత్రాలు ధ్వంసం చేయడానికి గుర్తించినవే: టీజీపీఎస్సీ 
ఆదివారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై టీజీపీఎస్సీ స్పందించింది. రోడ్లపై కనిపించిన ఓఎంఆర్‌ షీట్లు 2018 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల నియామక పరీక్షకు చెందినవేనని కమిషన్‌ కార్యదర్శి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)ను విచారణాధికారిగా కమిషన్‌ నియమించింది. పూర్తి విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లను మూడేళ్ల పాటు భద్రపరుస్తారని, ఆ తర్వాత నిర్దేశిత విధానాల ప్రకారం వాటిని గుర్తించి ష్రెడ్డింగ్‌ కోసం పంపిస్తామంటూ వివరణ ఇచ్చింది. 2018లో నిర్వహించిన హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల నియామక పరీక్ష నియామక ప్రక్రియ చాలా కాలం క్రితమే పూర్తైందని స్పష్టం చేసింది. ఈ షీట్లు ఇప్పటికే ధ్వంసం కోసం గుర్తించినవేనని తెలిపింది. అయితే అవి బహిరంగ ప్రదేశంలోకి ఎలా వచ్చాయనే అంశంపై విచారణ జరపుతామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రికార్డుల భద్రత, నిర్వహణ, ధ్వంసం ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించి మరింత పటిష్టం చేస్తామని కమిషన్‌ వెల్లడించింది. 

డీసీఎం నుంచి కింద పడిపోయాయి: అత్తాపూర్‌ సీఐ 
మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డుపై కన్పించిన ఓఎంఆర్‌ షీట్లను పోలీసులు టీజీపీఎస్సీకి పంపించారు. కాగా అవి పాతవని, వాటిని ధ్వంసం చేయడానికి కాంట్రాక్టర్‌ జబ్బార్‌కు అప్పగించగా ఆయన డీసీఎంలో వాటిని ఆరాంఘర్‌ వైపు తీసుకువెళ్తున్న సమయంలో క్రింద పడిపోయాయని దర్యాప్తులో తేలినట్లు అత్తాపూర్‌ సీఐ సీతయ్య తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement