కంప్యూటర్స్, ఎమర్జింగ్ కోర్సుల్లో బోధన విధానం పూర్తిగా మారాలి
80 శాతం యూనివర్సిటీల్లో మూస పద్ధతుల్లోనే బోధన
థియరీ సరిపోదు.. ప్రాక్టికల్ విద్యతోనే నైపుణ్యం పెరుగుదల
దూసుకెళుతున్న ఏఐకి తగిన వేగం కన్పించడం లేదు
డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కోర్సుల పంథా మారాలి
సాఫ్ట్‌వేర్ నిపుణుల భాగస్వామ్యం పెంచాలి
దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు ఏఐసీటీఈ సూచన
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో బోధన విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. కీలకమైన కోర్సుల్లో నాణ్యత పెంచాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది. ప్రస్తుత బోధన విధానమే కొనసాగితే కోర్సుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కేవలం థియరీకే పరిమితం కావద్దని, ప్రాక్టికల్ విద్యతోనే నైపుణ్యం పెరుగుతుందని, అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని వెల్లడించింది. దాదాపు 80 శాతం యూనివర్సిటీల స్థాయి ఎమర్జింగ్ కోర్సుల్లో బోధన మూస పద్ధతుల్లో ఉందని, ప్రస్తుత అవసరాలను అందుకునే స్థాయిలో లేదని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) రకరకాల రూపాల్లో దూసుకెళ్తున్నా, కంప్యూటర్ కోర్సుల్లో దానికి తగిన వేగం ఏ మాత్రం కన్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఐఐటీలు, ఏఐసీటీఈ.. సీఎస్‌ఈ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐఎంఎల్ వంటి కోర్సుల బోధనపై అధ్యయనం చేశాయి. ఇందుకు సంబంధించిన పరిశీలనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. దీంతో పాటు ఏఐసీటీఈ అన్ని యూనివర్సిటీలకూ పలు సూచనలు చేసింది.
తొలి దశ ఇంటర్వ్యూల్లోనే 50% మంది ఫెయిల్
దేశవ్యాప్తంగా ఏటా 13 లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో 72 శాతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలనే ఎంచుకుంటున్నారు. ఏఐఎంఎల్‌లో 2 లక్షల మంది, డేటాసైన్స్‌లో 1.5 లక్షలు, సైబర్ సెక్యూరిటీలో లక్ష మంది చేరుతున్నారు. వీళ్ళు కాకుండా మరో 3 లక్షల మంది ఎమర్జింగ్ కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా చేస్తున్నారు. మొత్తంగా 8 లక్షలకుపైగా విద్యార్థులు కంప్యూటర్ కోర్సులనే ఎంచుకుంటున్నారు. వీరిలో ప్రతి ఏటా నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలు పొందుతున్నది కేవలం 9 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఈ విద్యార్థులంతా ఇంజనీరింగ్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. అయితే తొలి దశ ఇంటర్వ్యూల్లోనే 50 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. ఇంజనీరింగ్‌లో చేసేది కంప్యూటర్ సంబంధిత కోర్సులే అయినా సాఫ్ట్‌వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ఏఐ ఆధారిత మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతికత తోడవుతోంది. ముఖ్యంగా చదువుకునే సమయంలో పారిశ్రామిక భాగస్వామ్యం లేకపోవడం వల్ల మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది.
మార్పులు గుర్తించాలి..
డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కోర్సుల్లో ట్రెండ్ (పంథా) పూర్తిగా మార్చాలని ఏఐసీటీఈ సూచిస్తోంది.
⇒ జనరేటివ్ ఏఐలో లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఏజెంట్లు, మల్టీ మోడల్ ఏఐ వంటి అంశాల్లో మార్పులను గుర్తించాలి. ఇది థియరీ ఆధారంగా నేర్పడం కష్టం. సాఫ్ట్‌వేర్ నిపుణుల భాగస్వామ్యంతో మాత్రమే వస్తుంది. దీంతో పాటు ఆయా అంశాలను విద్యార్థి మొదట్నుంచీ ప్రాక్టీస్ చేసే (ప్రాక్టికల్స్) విధంగా ఉండాలి.
⇒ ఏఐతో పాటు డేటాసైన్స్ సమ్మేళనం ప్రాధాన్యతగా భావిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ ఆధారిత డేటా విశ్లేషణపై పుస్తకాలకే పరిమితం కాకూడదు. వాస్తవ పరిస్థితిని విశ్లేషించే పరిజ్ఞానం విద్యార్థిలో తీసుకురావాలి. దీనివల్ల కొత్త మార్పులను గుర్తించడమే కాదు... విద్యార్థి కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళే అనుభవం వస్తుంది. దీన్నే సాఫ్ట్‌వేర్ రంగాలు కోరుకుంటున్నాయి.
⇒ సైబర్ సెక్యూరిటీలో రక్షణ వ్యవస్థపై మరింత పట్టు పెంచాలి. టెక్నాలజీతో పాటు దూసుకొస్తున్న రక్షణ సమస్యలను సరికొత్త టూల్స్‌తో పరిష్కరించే నేర్పు ఇంజనీరింగ్ పూర్తయ్యేలోగా విద్యార్థి కలిగి ఉండాలి. ఏఐ ఆధారంగా వచ్చే ముప్పును గుర్తించడం, ఆటోమేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ చేపట్టడం, క్లౌడ్ సెక్యూరిటీ వైపు దృష్టి పెట్టడం వంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకంగా నేర్చుకునే ధోరణి పెంచాలి. ప్రస్తుతం పేరున్న క్లౌడ్ ప్లాట్ ఫాంతో కలిసి డేటా సైన్స్, ఏఐ కోర్సుల బోధన విధానాలను చేపట్టాలి.
⇒ యూనివర్సిటీలు కేవలం థియరీకే పరిమితం కాకుండా, కోర్సులోని సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా, వాస్తవ డేటా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. దీనికోసం హ్యాకథాన్‌లు, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహించాలి. ఏఐ నైతికత, ఏఐ చట్టాలు వంటి అంశాలపై నైపుణ్యం పెంచేందుకు మూడు నుంచి ఆరు నెలల కాలవ్యవధి గల సిర్టిఫికెట్ కోర్సులను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.


