గ్రామాల్లో మున్సిపల్ తరహాలో హోల్డింగ్ పన్ను,ఇతర స్థానిక పన్నుల అమలుకు కేంద్రం యోచన
ప్రతి ఇంటి నుంచి ఏటా రూ.1,200 పన్ను వసూలు
వాటితో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర సౌకర్యాల కల్పన
ఈ తరహా పన్ను విధానం అమలుపై గ్రామాల్లో భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చేందుకు, మున్సిపల్ కార్పొరేషన్ల తరహాలో గ్రామాల్లో హోల్డింగ్ పన్ను, ఇతర స్థానిక పన్నులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కింద ప్రతి ఇంటి నుంచి ఏటా రూ.1,200 పన్ను వసూలు చేస్తారు. దీనికి ప్రతిఫలంగా గ్రామస్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు. పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకుంటేనే, కేంద్రం ఇచ్చే అదనపు ప్రోత్సాహక గ్రాంట్లు అందుతాయనే నిబంధనను తీసుకురానున్నారు.
ఇదీ కేంద్రం ప్రతిపాదన...
కేంద్రం తెస్తున్న ఈ మోడల్ ఓన్ సోర్స్ రెవెన్యూ (ఓఎస్‌ఆర్) గైడ్‌లైన్స్ ప్రకారం... తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల బాధ్యతలు, అధికారాలు పూర్తిగా మారనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన ఈ కొత్త గ్రామీణ పన్ను విధానం 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం...
⇒ ప్రస్తుతం గ్రామ పంచాయతీలు తమ దైనందిన ఖర్చుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపైనే ఆధారపడుతున్నాయి. దీనిని తగ్గించి, గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ విధాన ముఖ్య లక్ష్యం.
⇒ మున్సిపల్ కార్పొరేషన్లు ఏ విధంగానైతే ఆస్తి పన్ను, ఇతర సేవా రుసుములు వసూలు చేసి సౌకర్యాలు కల్పిస్తాయో, గ్రామాల్లోనూ అదే విధానాన్ని అమలు చేసి పట్టణ తరహా పాలన తీసుకురావాలనేది ప్రణాళిక.
⇒ ఈ ప్రతిపాదన ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇల్లు లేదా హోల్డింగ్‌పై సగటున ఏడాదికి రూ.1,200 స్థానిక పన్నుగా నిర్ణయించే అవకాశముంది. దీనిని నెలవారీగా లేదా వార్షిక ప్రాతిపదికన వసూలు చేస్తారు.
⇒ గ్రామాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు (దుకాణాలు, గోదాములు, చిన్న పరిశ్రమలు) అన్నింటినీ శాటిలైట్ లేదా డ్రోన్ సర్వేల ద్వారా డిజిటల్ మ్యాపింగ్ చేసి ఈ పన్నును నిర్ధారిస్తారు.
⇒ గ్రామ కార్యదర్శులకు గ్రామంలోని ప్రతి నిర్మాణ (ఇల్లు, దుకాణం, రైస్ మిల్లు, పౌల్ట్రీ ఫామ్) వైశాల్యాన్ని లెక్కించి, మున్సిపాలిటీల తరహాలో పన్ను ఆసెస్ చేసే అధికారాలు ఇస్తారు.
⇒ గ్రామంలో వెలిసే మొబైల్ టవర్లు, చిన్న పరిశ్రమలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్ల నుంచి భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు వసూలు చేసే పూర్తి అధికారం సర్పంచ్, కార్యదర్శికి ఉంటుంది.
⇒ ప్రజల నుంచి వసూలు చేసే ఈ పన్ను నిధులను పంచాయతీలు ప్రభుత్వ ట్రెజరీకి పంపకుండా, నేరుగా గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు– మౌలిక వసతులు వంటి సదుపాయాలు కల్పిస్తారు.
ఈ పన్ను విధానంపై గ్రామాల్లో భిన్నాభిప్రాయాలు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్రామీణ పరిస్థితుల రీత్యా ఈ మున్సిపల్ తరహా పన్ను విధానం అమలు చేయడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఇంటి పన్ను ఏడాదికి కేవలం రూ.100 నుంచి రూ.300 లోపే ఉంది. దీనిని ఒక్కసారిగా సగటున రూ.1,200లకు పెంచడం వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముంది.
రాష్ట్ర సర్కార్ స్లాబ్ సిస్టమ్ ?
కేంద్ర మార్గదర్శకాలను అమలు చేస్తూనే, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్లాబ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. చిన్న రేకుల ఇళ్లకు తక్కువ పన్ను (ఉదాహరణకు రూ.300 నుంచి రూ.500), పెద్ద భవనాలు, బహుళ అంతస్తుల ఇళ్లు, కమర్షియల్ షాపులకు గరిష్టంగా రూ.1,200 లేదా అంతకంటే ఎక్కువ పన్ను విధించేలా నిబంధనలను సవరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.


