స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫాం, పుస్తకాలు ఇస్తామన్న ప్రభుత్వం
కార్పొరేట్‌కు దీటుగా బ్రాండెడ్ దుస్తులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం
ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం కోసం మొత్తం 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం
గతంలో పూర్తిగా చేనేత సహకార సంఘానికే వస్త్రం అందించే బాధ్యత
ఈసారి ప్రైవేటు సంస్థలకు 70%.. సహకార సంఘానికి 30 శాతం
ఆలస్యంగా సాగిన టెండర్ల ప్రక్రియ..
అడ్వాన్స్ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కాంట్రాక్టు కంపెనీలు!
ఎంత వస్త్రం తయారయ్యిందనే దానిపై స్పష్టత కరువు
సకాలంలో ఇస్తే కుట్టు పని పూర్తయ్యేదంటున్న మహిళా సంఘాలు
27 లక్షల మంది విద్యార్థులకు 54 లక్షల యూనిఫాంలు అవసరం
ఆగస్టు నెలాఖరు వరకు ఆగాల్సిందే అంటున్న అధికారులు
కొత్తగా చేరిన లక్షకు పైగా విద్యార్థులకు అందని పుస్తకాలు..
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ మెరుగు పరుస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పింది. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, పుస్తకాలు.. అన్నీ అందిస్తామని ప్రకటించింది. దుస్తుల రంగు కూడా ఆకర్షణీయంగా కన్పించేలా మార్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్ళించేందుకు చేపట్టిన బడిబాటలోనూ టీచర్లు ఇవే అంశాలను తల్లిదండ్రులకు వివరించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది లక్ష వరకూ అడ్మిషన్లు పెరిగాయి. కానీ స్కూళ్లు తెరిచి నెల రోజులు కావొస్తోంది. కానీ ఇంతవరకూ యూనిఫాం అందలేదు. పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. యూనిఫాం కోసం ఆగస్టు నెలాఖరు వరకూ ఓపిక పట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. యూనిఫాం కూడా ఇవ్వకపోవడంతో పిల్లలు పాత దుస్తులే ధరించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఎందుకీ ఆలస్యం?: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,901 పాఠశాలలున్నాయి. ఇందులో 12,126 ప్రైవేటు స్కూళ్లు కాగా. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. కాగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇదే క్రమంలో విద్యార్థులకు బ్రాండెడ్ (మన్నికైన) దుస్తులు అందించేందుకు రూ.678.78 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది.
ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల యూనిఫాం, దుప్పట్లు, బెడ్‌షీట్లు ఇవ్వాలంటే మొత్తం 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో ఈ వ్రస్తాన్ని స్థానిక చేనేత కారి్మకుల సహకార సంఘం నుంచి కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఎక్కువ భాగం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. సహకార సంఘానికి 30 శాతం వస్త్రం కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. కాగా ప్రైవేటు సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ తయారు చేయడం, టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడం, అనుమతుల ప్రక్రియ సాఫీగా సాగలేదు. కొంత ఆలస్యమైంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ చెల్లింపులోనూ జాప్యం జరిగినట్టు కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి.
సహకార సంఘాలకు ముందస్తుగా చెల్లించకపోయినా వస్త్రం మాత్రం సమకూర్చేవి. యూనిఫాంకు 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలను ఎంచుకుంటే ఏతావాతా..వస్త్రం ఇవ్వడంలోనే జాప్యం చోటు చేసుకుంది. మిల్లుల నుంచి వాటిని తెప్పించడం మరింత ఆలస్యమైంది. వాస్తవానికి కావాల్సిన వస్త్రం కూడా పూర్తిస్థాయిలో అందలేదని సమాచారం. కాగా ఎంత వచ్చింది అనే వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.
పొలం పనులు వదిలేసుకుని కుట్టడం ఎలా?
వస్త్రం రావడం ఆలస్యం కావడం, వచ్చిన తర్వాత కుట్టడానికీ సమయం పట్టే అవకాశం ఉండటంతో యూనిఫాంల పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకోక తప్పదని అధికారులే అంటున్నారు. యూనిఫాం కుట్టే బాధ్యత ఎక్కడికక్కడ స్వయం సహాక సంఘాలకు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ స్కూళ్ళు మొదలైన సమయంలో చేపడితే ఇప్పటికే యూనిఫాం కుట్టడం పూర్తయ్యేది. అలాకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు మొదలయ్యాక వస్త్రం ఇచ్చారని సంఘాల మహిళలు చెబుతున్నారు. కటింగ్ కోసం మండల కేంద్రానికి వెళ్ళడం, కటింగ్ పూర్తయిన తర్వాత వాటిని కుట్టడంపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం మహిళా సంఘాలకు ఉందని చెప్పినా, ఫలితాలు మాత్రం ఈ దిశగా లేవని అధికారులు అంటున్నారు.
‘యూనిఫాం కుట్టేందుకు ఒక్కోదానికి రూ.75 ఇస్తారు. పొలం పనులు వదిలేసుకుని దీనిపైనే ఎలా ఆధార పడతాం’ అని మహిళలు అంటున్నారు. ఒక్కొక్కరు రోజుకు 10 వరకు యూనిఫాంలు కుట్టే అవకాశం ఉండగా, 27 లక్షల విద్యార్థుల కోసం 54 లక్షల యూనిఫాంలు అవసరం. కాగా ఆగస్టు నెలాఖరు వరకూ యూనిఫాం అందించడం సాధ్యం కాకపోవచ్చని పాఠశాల విద్య అధికారులు భావిస్తున్నారు.
పుస్తకాలకూ ఇబ్బందే
కేజీబీవీలు, గురుకులాల్లో పుస్తకాల పంపిణీ సరిగానే జరిగింది. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ (విద్యకు సంబంధించిన సమాచార వ్యవస్థ) లెక్కల ప్రకారం పుస్తకాలు, నోట్‌బుక్‌లు ఇచ్చారు. అయితే బడిబాట వల్ల, ఇతర మార్గాల్లో కొత్తగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన వారికి మాత్రం ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా లక్షపైనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు చివరివరకూ కొత్త ప్రవేశాలకు సమయం ఉంది. ఇది ముగిసిన తర్వాతనే కొత్త వారి జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అప్పుడు కొత్త పుస్తకాల ముద్రణకు టెండర్లు ఖరారు చేయాలి. దీంతో పాటు పేపర్ తెప్పించాలి.
ఇప్పటికే పేపర్ సరఫరా చేసే సంస్థలకు రూ.150 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ముద్రించే కాంట్రాక్డు సంస్థలకూ రూ.కోట్లల్లోనే బకాయిలున్నాయి. ఇవి రాకుండా ముందుకెళ్ళేందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖంగా లేవని తెలుస్తోంది. దీనివల్ల పుస్తకాల పూర్తిస్థాయి పంపిణీలో కూడా తీవ్ర జాప్యమే చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం..
యూడైస్ లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళల్లో 16 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేశాం. ఎక్కడా ఇబ్బంది లేదు. కొత్తగా చేరిన వారికీ అందిస్తాం. యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం.
– డాక్టర్ నవీన్ నికొలస్ (పాఠశాల విద్య కమిషనర్)


