హైదరాబాద్: షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించడం చర్చనీయాంశమైంది.
మూడు రోజుల క్రితం ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయిన రాజ్‌కుమార్ కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చవని భావిస్తున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. రాజ్‌కుమార్ మృతదేహం కనపడిన ప్రదేశం అతడి మేనమామ ఊరే.
రాజ్‌కుమార్ విషయంలో వదంతులను నమ్మవద్దని, అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు ఇప్పటికే చెప్పారు. రాజ్‌కుమార్‌పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలోని వివరాల ప్రకారం.. బాలికను ఏడాదిగా రాజ్‌కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెట్టాడని బాలిక తల్లి చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నీ తండ్రిని చంపినట్లే, మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్‌ను మే 26న అరెస్టు చేశారు. జూన్ 12న అతడికి బెయిల్ లభించింది.
ఇదీ కేసు
ఎనిమిదేళ్ల కిందట సరిత అనే మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రాజ్‌కుమార్. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పక్కింట్లో ఉండే బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించాడు. దీంతో అతడి భార్య కూడా అతడిని అసహ్యించుకుంది. బాలికకు వేధింపులు ఎక్కువయ్యాయి. బాలిక కుటుంబం పోక్సో కేసు పెట్టింది. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్ జులై 10వ తేదీన రాత్రి మైనర్ బాలికను, ఆమె తల్లి, నాన్నమ్మలతో పాటు తన భార్య సరిత, ఇద్దరు బిడ్డల్ని గొంతు కోసి చంపాడు.


