6 హత్యలు చేసి.. మేనమామ ఊళ్లో శవమై | POCSO case accused Rajkumar commits suicide in Penjarla suburb | Sakshi
Sakshi News home page

6 హత్యలు చేసి.. మేనమామ ఊళ్లో శవమై

Jul 14 2026 5:59 AM | Updated on Jul 14 2026 5:59 AM

POCSO case accused Rajkumar commits suicide in Penjarla suburb

పెంజర్లలోని ఘటనా స్థలంలో రాజ్‌కుమార్‌ మృతదేహం వద్ద పంచనామా నిర్వహిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) రాజ్‌కుమార్‌

పెంజర్ల శివారులో పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య 

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్న పోలీసులు 

ఎప్పుడు, ఎలా చనిపోయాడనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్న సీపీ 

హత్యలకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్న రాజ్‌కుమార్‌ 

అంతా తనను మోసం చేశారని, అంతమొందించేదాకా నిద్రపోనని వెల్లడి

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  భార్యాపిల్లలు సహా ఆరుగురిని దారుణంగా హత్య చేసిన పార్వతి రాజ్‌కుమార్‌ (28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్వగ్రామమైన దైవాలగూడకు 30 కిలోమీటర్ల దూరంలోని మేనమామ ఊరైన పెంజర్లలో సోమవారం మధ్యాహ్నం అతని మృతదేహాన్ని గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీంను పిలిపించి, ఆధారాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడకు చెందిన పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌..తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మైనర్‌ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు వారికి సహకరించిందనే కోపంతో భార్యను అలాగే ఇద్దరు కొడుకుల్నీ శుక్రవారం రాత్రి కత్తితో పొడిచి, గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. అయితే హత్యాకాండ తర్వాత కారులో షాద్‌నగర్‌ వైపు వచ్చిన రాజ్‌కుమార్‌ శనివారం ఉదయం తిమ్మాపూర్‌ సమీపంలో వాహనాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 

ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే సోమవారం మధ్యాహ్నం అతని మృతదేహం కని్పంచింది. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో అది తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందుఎవరెవరిని కలిశాడు? షాబాద్‌ నుంచి ఏ రూట్లో ఇక్కడికి చేరుకున్నాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 

అప్పులు చేసి, సైకోగా మారి.. 
‘రాజ్‌కుమార్‌ పేరున 16 సిమ్‌ కార్డులు ఉన్నట్లు గుర్తించాం. ఐదారు సెల్‌ ఫోన్లు వాడాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఎక్కువగా ఆడేవాడు. రూ.2 కోట్లకు పైగా అప్పులు చేశాడు. ఒత్తిడితో సైకోగా మారాడు. మే 16న అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. జూన్‌లో ముందస్తు బెయిల్‌ తీసుకుని బయటికి వచ్చాడు. నిందితునికి ఒక స్కూటీ ఉంది. కాగా జూలై 10న ఓ కంపెనీ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. ఫోన్‌పే ద్వారా రూ.2 వేలు చెల్లించాడు. రాత్రి 10.30 గంటల తర్వాత కారులో షాబాద్‌ చేరుకున్నాడు. 

కారును ఇంటి వెనుకవైపు ఉన్న గ్రౌండ్‌లో పార్కు చేశాడు. ప్రహరీ దూకి  మైనర్‌ బాలిక (17) ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన తల్లి చిట్యాల లక్షి్మ(45)ని కత్తితో పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన బాలిక నానమ్మ రుక్కమ్మ (60) గొంతు కోశాడు. బాలికను బలవంతంగా అక్కడి నుంచి దైవాలగూడకు తీసుకెళ్లాడు. ఆమెను హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లి.. భార్య సరిత, ఇద్దరు పిల్లలను అదే కత్తితో గొంతుకోసి చంపాడు. అప్పటినుంచి నిందితుడి కోసం 12 బృందాలతో గాలిస్తున్నాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. 

బంధువులు, స్నేహితులను కూడా విచారించాం. రాజ్‌కుమార్‌ దగ్గర నగదు కూడా ఎక్కువ లేదు. అద్దెకు తెచి్చన కారును చేగూరు వద్ద వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ సహా బెంగళూరు, శ్రీశైలం, సమీపంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వైన్‌షాపులు, హోటళ్లు, చివరకు చేగూరు అటవీ ప్రాంతంలోనూ వెతికాం. అయినా మాకు చిక్కలేదు. నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు బహుమానం  ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం కోదాడ నుంచి ఓ మహిళ కాల్‌ చేసింది. 

అక్కడ ఓ వ్యక్తి నిందితుడి మాదిరే ఉన్నట్లు చెప్పడంతో వెంటనే పోలీసులు వెళ్లి పరీశీలించారు. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి 100కు కాల్‌ వచి్చంది. కొత్తూరు మండలం పెంజర్ల శివారులో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో రాజ్‌కుమార్‌ సోదరుడు భాస్కర్‌ సహా ఇతర బంధువులను పిలిపించాం. మృతదేహం రాజ్‌కుమార్‌దిగా నిర్ధారించాం..’ అని సీపీ తెలిపారు. 

ఫోన్‌ గ్యాలరీలో సెల్ఫీ వీడియో.. 
‘రాజ్‌కుమార్‌ మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా ఉంది. సెల్‌ఫోన్‌ దొరికింది. బస్‌ టికెట్లు దొరికాయి. ప్యాకెట్‌లో రూ.1,260 నగదు ఉంది. సెల్‌ఫోన్‌ ఆన్‌ చేసి చూస్తే.. గ్యాలరీలో వీడియో దొరికింది. హత్యలకు ముందు శుక్రవారం సాయంత్రం 4.55 గంటలకు 2 నిమిషాల 26 సెకండ్ల నిడివితో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  

అంతా మోసం చేశారు.. 
మైనర్‌ బాలిక తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య నన్ను మోసం చేశారు. ఆర్థికంగా నష్టాలకు కారణమయ్యారు. వారిని నమ్మి మోసపోయాను. నాపై అన్యాయంగా పోక్సో కేసు పెట్టారు. వాళ్లను అంతమొందించేదాక నిద్రపోను..అని వీడియోలో ఉంది. రాజ్‌కుమార్‌ ఎప్పుడు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలు™తుంది. 2025 అక్టోబర్‌లోనూ నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడు నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు..’ అని సీపీ వెల్లడించారు.  

అంత్యక్రియలకు నిరాకరించిన తల్లిదండ్రులు 
చేవెళ్ల: రాజ్‌కుమార్‌ తల్లిదండ్రులు పోలీసులు పిలవడంతో ఆస్పత్రికి వచి్చనప్పటికీ అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. బంధువులెవరూ రాలేదు. అంతకుముందు రాజ్‌కుమార్‌ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్థానిక డాక్టర్‌ స్వర్ణలత, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ ప్రణీతల బృందం రాత్రి 10:30 గంటలకు ఈ ప్రక్రియను పూర్తిచేసి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. రాత్రి 11 గంటలకు చేవెళ్ల స్మశానవాటికలో మున్సిపల్, పోలీసు సిబ్బంది శవాన్ని దహనం చేశారు. అంత్యక్రియల కార్యక్రమంలోనూ అతని తల్లిదండ్రులు పాల్గొనలేదు.  

ఇంత సులభంగా చస్తాడనుకోలేదు 
రాజ్‌కుమార్‌ ఇంత క్రూరంగా మారతాడని అనుకోలేదు. పసి పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. వాళ్లను ప్రాణాలతో వదిలేస్తే నేనైనా సాదుకునే వాడిని. ఆరుగురిని అకారణంగా హత్య చేసిన ఈ నరరూప రాక్షసుడు ఇంత సులభంగా చస్తాడనుకోలేదు. వాడిని తూట్లు.. తూట్లుగా పొడిచి చంపాల్సి ఉండేది. వాడు గతంలో పురుగుల మందు తాగినప్పుడే చచి్చనా బాగుండేది. 
– పార్వతి భాస్కర్, మృతుడి అన్న 
 
వాడి శవాన్ని ఊర్లోకి రానివ్వం 
వాడి శవాన్ని చూసినా గుండె మండుతోంది. ప్రేమ పేరుతో నాబిడ్డను ఉసురుపోసుకున్నాడు. పెళ్లి చేసుకుని కాటికి పంపించాడు. నా బిడ్డతో పాటు అన్నెం పున్నెం ఎరగని ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి రాక్షసున్ని మా కళ్ల ముందు చంపి ఉంటే సంతోషించేవాళ్లం. వాడి శవాన్ని కూడా ఊరిలోకి రానివ్వం.. ఇక్కడ అంత్యక్రియలు చేయనీయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement