అనుమతుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి | CM Revanth Reddy Comments in meeting with MPs | Sakshi
Sakshi News home page

అనుమతుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి

Jul 14 2026 3:03 AM | Updated on Jul 14 2026 3:03 AM

CM Revanth Reddy Comments in meeting with MPs

ప్రాజెక్టులు, రవాణా వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలి 

ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయండి 

పార్టీలకతీతంగా అవసరమైన సమాచారం అందజేస్తాం 

ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో కేంద్రంవద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలన్నారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌– 1, స్వాదీనం, మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం ఎంపీలకు వివరించారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ కన్సల్టెంట్‌గా నియమించే ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలన్నారు. ఈ విషయంలో  ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం తెలిపారు. మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచి్చందని సీఎం తెలిపారు. ఈ పనులను అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్‌ లెటర్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. 

ఎన్‌ఓసీలు :  
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉందని ఈ అంశంలో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడామని వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్‌ఓసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150–151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్‌ రైళ్లకు సంబంధించి ఎలైన్‌మెంట్లు కొలిక్కివచ్చాయని సీఎం తెలిపారు.  

– ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కోఆర్డినేషన్‌కు ఐఏఎస్‌ అధికారి అద్వైత్‌కుమార్‌ సింగ్‌ను నియమించామని సీఎం చెప్పారు. పెండింగ్‌ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్‌ డాక్టర్‌ మల్లు రవికి సీఎం సూచించారు.  

ఎంపీలు అడిగిన సమాచారం ఇవ్వండి : భట్టి విక్రమార్క 
ఎంపీలు అడిగిన ప్రతి సమాచారం అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేసి పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రిగానీ, తాను గానీ స్వయంగా ఢిల్లీకి వస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అక్కడ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏఏ అంశాలపై ఒత్తిడి తేవాలనే దానిపై చర్చిస్తామన్నారు. 

ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీల సిఫారులను పట్టించుకోండి : ఈటల రాజేందర్‌ 
ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీలు ఇచి్చన సిఫార్సుల మేరకు కేటాయింపులు చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీల ప్రోటోకాల్‌ దెబ్బతినకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి తమ వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ నుంచి రామగుండం రైల్వే లైన్‌ కోసం పార్లమెంట్‌లో నేను రెండు మూడుసార్లు మాట్లాడానని, ఇవ్వడానికి ఒప్పుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలన్నారు.  

ఎంపీలు ఏమన్నారంటే.... 
గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్‌ మిల్లు పునరుద్ధరణపై ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అధికారులను ప్రశ్నించారు. 7–8 నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటు చేయాలని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్‌ విషయాలు తెలియజేస్తే సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. 

కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని.. ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వందలాది ప్రతిపాదనలు కేంద్ర ఫ్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 181 అంశాలతో కూడిన ఎజెండాను ఈ సందర్భంగా ఎంపీలకు అందజేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement