ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దీంట్లో బైటపడిన మోస్ట్ ఐ-క్యాచింగ్, షాకింగ్ విషయం ఏంటంటే..? ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రజలు అమెరికా కంటే చైనానే ఎక్కువగా ఇష్టపడుతున్నారట..! అవును..! మీరు చదివింది నిజమే..! ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాధించుకున్న 'సాఫ్ట్ పవర్' క్రమక్రమంగా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.
ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే..
అసలు అమెరికా మీద ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది..? చైనా గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పైకి వెళ్తోంది..? దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందా? ముందుగా ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే.. అమెరికా గ్రాఫ్ పడిపోవడానికి కేవలం అమెరికా తప్పులే కారణం కాదు..! చైనా తన ఇమేజ్‌ను గతంతో పోలిస్తే చాలా మెరుగుపరుచుకుంది. సర్వే చేసిన 37 దేశాల సగటు చూసుకుంటే.. చైనాకు అనుకూలంగా 51 శాతం మంది ఓటు వేస్తే, వ్యతిరేకత 39 శాతమే ఉంది..! అంటే చైనాకు నెట్ పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట..! ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో చైనాకు మంచి మద్దతు ఉంది. మన ఇండియా మాత్రం దీనికి మినహాయింపు అనుకోండి..!
కారణం ఇదే..
అలాగే, పేద దేశాల్లో చైనాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఐరోపా లాంటి ధనిక దేశాల్లో చూస్తే.. స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి అత్యంత ధనిక దేశాల ప్రజలు చైనాను కాస్త తక్కువగా ఇష్టపడినా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తర్వాత చైనా మీద ఉన్న నెగెటివిటీ అయితే చాలావరకు తగ్గిపోయింది. కానీ, అమెరికా పరిస్థితి పూర్తిగా తారుమారైంది..! ఆ 37 దేశాల సగటు తీసుకుంటే.. అమెరికాను కేవలం 37 శాతం మందే ఇష్టపడుతున్నారు. ఏకంగా 57 శాతం మంది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడారు.
కేవలం 9 దేశాల్లో మాత్రమే..
గత ఏడాదితో పోలిస్తే, ఒక్క మెక్సికో మినహా ప్రతి దేశంలోనూ అమెరికా మీద అభిమానం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే పడిచచ్చే జర్మనీ లాంటి దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీలో కేవలం 27 శాతం మందే అమెరికాను ఇష్టపడుతున్నారు. కానీ చైనాను ఇష్టపడేవాళ్ళు మాత్రం దానికంటే ఎక్కువే ఉన్నారు..! ప్రపంచంలో కేవలం 9 దేశాల్లో మాత్రమే.. అంటే బ్రెజిల్, ఘనా, హంగేరి, పోలాండ్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండియా, జపాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ చైనా కంటే అమెరికానే బెటర్ అనుకుంటున్నారు.
ఇదొక్కటే సమస్య కాదు..
సరే..! అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 'డొనాల్డ్ ట్రంప్' గురించి. అమెరికా వెలుపల ట్రంప్‌కు పాపులారిటీ ఎంత తక్కువగా ఉందో ఈ సర్వే మరోసారి నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 23 శాతం మందికి మాత్రమే ట్రంప్ మీద నమ్మకం ఉందట..! జో బైడెన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! అయితే ఇదొక్కటే సమస్య కాదు..! అమెరికా గత దశాబ్ద కాలంగా ప్రతి నాలుగేళ్లకోసారి వైట్‌హౌస్‌లో నాయకులు మారినప్పుడల్లా తన విదేశాంగ విధానాన్ని మార్చేస్తూ వస్తోంది. దీనివల్ల 'అమెరికా ఒక నమ్మకమైన భాగస్వామి కాదు' అనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడింది.
కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..!
కానీ, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళైతే ఒకటే మాట అనొచ్చు.. 'ఐ డోంట్ కేర్!' అని..! ఎందుకంటే, మెత్తగా మాట్లాడితే సాఫ్ట్ పవర్ వస్తుంది. కానీ, అందరూ మనల్ని మోసం చేస్తారనేది ఆయన వాదన. టారిఫ్‌లు, మిలిటరీ బెదిరింపులు లాంటి 'హార్డ్ పవర్' ఉపయోగించడం ద్వారానే అమెరికా తన పనులు సాధించుకోవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! హార్డ్ పవర్‌ని మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని షార్ట్-టర్మ్ లాభాలు రావచ్చు. కానీ, లాంగ్-టర్మ్‌లో అమెరికా చాలా నష్టపోతోంది.
ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు..
ఇందులో మొదటిది.. ఇతర దేశాలు అమెరికా దెబ్బకు భయపడి తమని తాము రక్షించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. రెండవది.. ఇది మల్టీపోలార్ (Multipolar) ప్రపంచం..! ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు. కండబలం చూపిస్తే మిగతా దేశాలు చైనాతో చేతులు కలిపేస్తాయి. అప్పుడు అమెరికా బొక్క బోర్లా పడాల్సిందే..!. ఇక మూడవది.. అమెరికా నాయకులు ఒక భ్రమలో ఉంటారు..! 'మా దగ్గర బలం ఉంది. కాబట్టి మిగతా దేశాలు మేము చెప్పినట్లు వింటాయి' అని. కానీ, ఇది తప్పు..! బ్రెజిల్ లాంటి దేశాల ఉదాహరణే తీసుకోండి. ట్రంప్ బ్రెజిల్ మీద టారిఫ్ బాంబులు వేస్తామని బెదిరించినా, అక్కడి అధ్యక్షుడు 'లూలా' వెనక్కి తగ్గలేదు సరికదా.. మరింత గట్టిగా బదులిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రజలకు జాతీయవాదం ముఖ్యం. కాబట్టి, లూలా అలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఇంకా పెరిగింది..!
అమెరికా నెగ్గుకురాగలదా..?
మొత్తానికి చూస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ హయాం, అమెరికాకు ఒక పెద్ద టెస్ట్ కేస్ అని చెప్పవచ్చు..! దశాబ్దాలుగా అమెరికా అంటే 'సాఫ్ట్ పవర్'.. 'హార్డ్ పవర్' రెండింటి కలయిక. మరి ఇప్పుడు కేవలం కండబలం అదే.. Hard Power మాత్రమే చూపించి అమెరికా నెగ్గుకురాగలదా..? లేదా తన గ్లోబల్ లీడర్‌షిప్‌ను కోల్పోతుందా..? రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.
-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్


