త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు | BSNL 5G Launching in AP Soon Check 5G Speed Trials Freedom Offers Fiber Plans | Sakshi
Sakshi News home page

త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు

Aug 16 2026 11:35 AM | Updated on Aug 16 2026 11:35 AM

BSNL 5G Launching in AP Soon Check 5G Speed Trials Freedom Offers Fiber Plans

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) మరో ఐదు నుంచి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో తన 5జీ సేవలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోందని సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్‌ జనరల్ మేనేజర్ (సీజీఎమ్‌) ఎం.శేషాచలం వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్వహిస్తున్న 5జీ క్షేత్రస్థాయి పరిశీలనలు (ట్రయల్స్) విజయవంతమైన ఫలితాలను ఇస్తున్నాయని, నిర్దేశిత వ్యవధిలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సమాంతరంగా రాష్ట్రవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ విస్తరణ, డిజిటల్ కనెక్టివిటీ వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఫ్రీడమ్ 20' మొబైల్ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను 24 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే రూ.1,111 నెలవారీ 'ఫైబర్ ఫ్రీడమ్' ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ వేగంతో 5,000 జీబీ డేటాతో పాటు 25కి పైగా ఓటీటీ వేదికల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా రూ.499 ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకునే చందాదారులకు మొదటి నెల సేవలు ఉచితమని, ఆ తర్వాతి మూడు నెలల పాటు నెలకు రూ.100 చొప్పున రాయితీ లభిస్తుందని వివరించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష 4జీ టవర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 6,850 టవర్లు, 15,000 బీటీఎస్‌లు అందుబాటులో ఉన్నాయని సీజీఎమ్‌ తెలిపారు. సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 2,641 సుదూర/రిమోట్ గ్రామాలకు 4జీ సేవలను అందించేందుకు 1,359 ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.24,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ఆపరేషనల్ ప్రాఫిట్‌లోకి ప్రవేశించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.30,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని శేషాచలం తెలిపారు. ఇందులో ఏపీ సర్కిల్ వాటాగా రూ.1,400 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. మొబైల్ సేవలకే పరిమితం కాకుండా శాటిలైట్ ఫోన్లు, ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ, ఈ-సిమ్, ఎంటర్‌ప్రైజ్ సేవలను విస్తరించడంతో పాటు యువతకు ఫ్రాంచైజీ, భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తున్నామని సీజీఎమ్‌ వివరించారు.

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement