యక్షప్రశ్న లంటే..? | Yaksha Questions and Yudhishthira Answers | Sakshi
Sakshi News home page

యక్షప్రశ్న లంటే..?

Mar 23 2026 12:06 AM | Updated on Mar 23 2026 12:19 AM

Yaksha Questions and Yudhishthira Answers

భారత విజ్ఞానం

ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం.  అలనాటి  ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు.

 పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.

ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. 

ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ  యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.

– సి.ఎన్‌. మూర్తి, పాత్రికేయులు

Advertisement
 
Advertisement
Advertisement