breaking news
yamadharma
-
యముడి అపరాధ ఫలమే విదురుడి జన్మ!
మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు.రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సు కొనసాగించారు.ఒకరోజు రాత్రి కొంతమంది మహాఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాండవ్యుని చూసి ‘‘మహానుభావుడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు?’’ అని ప్రశ్నించారు. అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని. అందుకు ఎవరినీ నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని కిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి ΄ోయింది. ఆ తరువాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో ‘మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు’ అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో ‘పద్నాలుగేళ్ళ వరకూ పిల్లలు ఏమి చేసినా తెలియక చేస్తారు.అందువల్ల ఇక మీదట పద్నాలుగేళ్ళలోపు బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు మానవ గర్భంలో జన్మించెదవు కాక’ అన్నాడు. ఆ శాప ఫలితమే వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టినట్లు మహాభారత గాథ ద్వారా తెలుస్తుంది. – డి.వి.ఆర్. -
యక్షప్రశ్న లంటే..?
ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం. అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు. పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.– సి.ఎన్. మూర్తి, పాత్రికేయులు -
యుముడిగా ట్రేడ్మార్క్.. యముడి పాత్రలో కైకాల చివరి సినిమా ఇదే!
నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో నటించి మెప్పించారు.భయపెట్టే విలనిజం నుంచి కరుణ రసం, కామెడీ పాత్రల్లో సైతం తన నటనతో మెప్పించిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యముడు అంటే బహుశా ఇయనలాగే ఉంటారేమో అనేంతలా కెరీర్లో పదుల సంఖ్యలో యముడి పాత్రలు పోషించి భళా అనిపించారు. యముండ అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది. యముడి పాత్రలో కైకాలను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతగా తన నటనతో కట్టిపడేశారు. యముడి పాత్రల్లో కైకాల నటించిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం.. 1977లో వచ్చిన యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్కు ఎంత పేరు వచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు వచ్చింది. 1998లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాలో కైకాల పోషించిన యముడు పాత్ర మరువలేనిది. ఆయుష్షు తీరకుండానే యమలోకానికి వెళ్లిన చిరు యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఎస్వీ క్రిష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీలలో కూడా కైకాల పాత్ర అత్యద్భుతం. కమెడియన్ అలీ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా యుముడిగా ఆకట్టుకున్నారు. ఇక తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్లీ మొదలైందిలోనూ రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు. చివరగా ఆయన రవితేజ నటించిన 'దరువు' చిత్రంలోనూ యముడి పాత్రలో మెప్పించారు. -
తమిళనాడులో 'యముడు' భయం ..
చెన్నై: వరద బీభత్సంతో అతలాకుతలమైన తమిళనాడును కొత్తగా యమధర్మరాజు భయపెడుతున్నాడు. తన వాహనం దున్నపోతుపై వచ్చి, ఇంటి యజమానుల ప్రాణాలను హరిస్తాడని ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్థానిక పంచాంగకర్తలు కూడా నిర్ధారించారు. దీంతో జనం భయం మరింత రెట్టింపైంది. ప్రధానంగా సేలం జిల్లా అంతటా యముడు వస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో మాంగల్యం కాపాడుకునేందుకు జిల్లాలోని మహిళలు బుధవారం తెల్లవారుజామునే నిద్ర లేచి, తలస్నానం ఆచరించి, ఇంటిముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. తమ తమ కుటుంబసభ్యులతో కలసి మహిళలు ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే బుధవారం రాత్రి దాకా యముడి జాడ ఎక్కడ కనిపించడపోవడంతో జిల్లా వాసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్లో వినాయకుడు పాలు తాగుతున్నాడని దేశవ్యాప్తంగా, మొన్నామధ్య ఇంటి పెద్దకొడుకుకు గండం ఉంటుందని తెలంగాణలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నేటి యముడి భయం కూడా అలాంటిదే. గుర్తుతెలియని వ్యక్తులు చేసే అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు గురి కావదంటూ ప్రజలకు పోలీసులు సూచించారు.


