వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు | YS Jagan Warning Effect: Chandrababu Govt to Declare Drought Mandals | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు

Sep 19 2026 2:02 PM | Updated on Sep 19 2026 2:35 PM

YS Jagan Warning Effect: Chandrababu Govt to Declare Drought Mandals

సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని జగన్‌ డిమాండ్‌ చేసిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన సీఎం.. అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు శనివారం స్వయంగా వెల్లడించారు. 

రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై వైఎస్‌ జగన్‌ ఈ నెల 17న పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కరువు మండలాలను ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ ఫైర్‌
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై జగన్‌ సమీక్షించారు. కరువు కాలంలో రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎల్‌నినో కంటే ‘ఎల్లో నినో’తోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూన్‌ నుంచి వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రకటన
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. సెప్టెంబర్‌ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్‌ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు.

రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పంటల పరిస్థితి, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.

హైరిస్క్‌ కేటగిరీలో 1,357 ఆర్‌ఎస్‌కేలు
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం రిస్క్‌ ఆధారిత అంచనాలు చేపట్టింది. 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటలను హైరిస్క్‌ కేటగిరీలో గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌లో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాగునీటి సమస్యపైనా సమీక్ష
ఇదిలా ఉండగా.. సాగుతో పాటు తాగు నీటి విషయంలోనూ జగన్‌ వార్నింగ్‌ పని చేసింది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు తాగునీరు, సాగునీటి లభ్యతపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.

ఇదీ చదవండి: బొత్స కూతురికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్‌ జగన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement