నగోయా: ఆసియా క్రీడల వుషు క్రీడాంశంలో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల సాండా ఈవెంట్ 60 కేజీల విభాగంలో భారత స్టార్ ఫైటర్ నరోమ్ రోషిబీనా దేవి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. చు మాన్ సిన్ (మకావ్)తో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రోషిబీనా 5–0తో గెలిచింది.
మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల రోషిబీనా 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల సాండా 56 కేజీల క్వార్టర్ ఫైనల్లో భారత ఫైటర్ ఆర్యన్ 1–2తో అబురషితోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.


