breaking news
World Heritage list
-
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం
యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ తరపున ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు. ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం తొలుత ప్రంబనన్ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు. మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు. ప్రంబనన్ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ వివరించారు. కాలాతీత చిహ్నం ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్‌కు దక్కిన అదృష్టం. గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
వారసత్వ సంపదతో మెరుగైన ప్రపంచం
న్యూఢిల్లీ: పూర్వీకుల నుంచి వచ్చిన ఘనమైన వారసత్వం అనేది కేవలం ఒక చరిత్ర కాదని, అదొక శాస్త్రం, వివిధ వర్గాల ప్రజలను కలిపే వారధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి వారసత్వ సంపదను ఉపయోగించుకోవాలని సూచించారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సు ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. చరిత్రాత్మక కట్టడాలు వారసత్వంగా వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు అప్పటి కాలంలోకి వెళ్తామని ఉద్ఘాటించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం, తమిళనాడులోని బృహదీశ్వరాలయం ఘనమైన వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతను నిలయమైన మన దేశంలో ఈ సదస్సు జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న డబ్ల్యూహెచ్‌సీ సదస్సుకు భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 31 దాకా ఈ సదస్సు జరుగనుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మస్త్.. మస్క్!
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం ఆయన సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. కుబేరుల జాబితాలో గతేడాది తొలి నాళ్లలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది తిరిగేసరికి అగ్రస్థానానికి చేరడం గమనార్హం. గురువారం టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఏడాది వ్యవధిలో టెస్లా షేరు కనిష్ట ధర రూ. 65.42 డాలర్లు కాగా ప్రస్తుతం 811.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. గతేడాది నవంబర్ ఆఖర్లో మస్క్ 127.9 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను తోసిరాజని రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. రెండు నెలలు కూడా తిరక్కుండానే మరో 60 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుని నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. టెస్లాలో మస్క్‌కు 20 శాతం దాకా వాటా ఉంది. ఆయన గతంలో ఇంటర్నెట్ పేమెంట్స్ కంపెనీ పేపాల్ హోల్డింగ్స్‌ను కూడా నెలకొల్పి, మంచి లాభాలకు విక్రయించారు. స్పేస్ఎక్స్ అనే రాకెట్ల తయారీ సంస్థ, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా నెలకొల్పారు. టనెల్స్ ద్వారా పూర్తి ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బోరింగ్ కంపెనీని సైతం ఎలాన్ మస్క్ ప్రారంభించారు. -
యునెస్కో జాబితాలో కొత్తగా 21 ప్రదేశాలు
క్రాకౌ( పోలాండ్) : పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 41వ సమావేశంలో ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో మరిన్ని ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో కొత్తగా 21 చారిత్రక ప్రాంతాలకు చోటు దక్కింది. భారత్ నుంచి గుజరాత్లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న జపాన్‌లోని ఒకినోషిమాకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్టు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్ దీవుల్లోని టవుటపువాటీ అనే పాలినేషియన్ ట్రయాంగిల్ కూడా ఉంది. అలాగే యూకేలో లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగోవార్ప్ కూడా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు యునెస్కొ గుర్తింపు పొందిన చారిత్రక ప్రదేశాల జాబితా 1073కి చేరింది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) యునెస్కో గుర్తింపు పొందిన కొత్త ప్రాంతాలు.. ► ది సాంబార్ ప్రీ కుక్ టెంపుల్ జోన్(కంబోడియా) ► పవిత్ర ఒకినోషిమా ద్వీపం (జపాన్) ► 1250-1517 మధ్యకాలంలో నిర్మించిన హెబ్రోన్(అల్-ఖలీల్ ఓల్డ్ సిటీ, పాలస్తినా) ► ది లేక్ డ్రిస్ట్రిక్ట్( ఇంగ్లండ్) ► క్రొయోషియా, ఇటలీ, మాంటీనీగ్రోల్లోని వెనేషియన్ వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ ► లాస్ అలెర్సస్ నేషనల్ పార్క్, పటగోనియా ► ది సిటీ ఆఫ్ యాజ్డ్, ఇరాన్ ► అఫ్రోడిసియాస్, టర్కీ ► ది తరనోస్కీ గోరీ మైన్, పోలాండ్ ► కేవ్స్ ఆఫ్ ది స్వాబియాన్ జురా, జర్మనీ ► క్వింగై హో క్సిల్, చైనా ► కులాంగ్సూ, చైనా ► అస్మరా, ఆఫ్రికా ► వలోంగో వార్ఫ్, బ్రెజిల్ ► బాంజా కోంగో, అంగోలా ► టపుటపూవాటీ, పాలినేషియా ► మంగోలియా, రష్యాలోని డావురియా ప్రకృతి దృశ్యాలు ► గుజరాత్లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్ నగరం


