
న్యూఢిల్లీ: పూర్వీకుల నుంచి వచ్చిన ఘనమైన వారసత్వం అనేది కేవలం ఒక చరిత్ర కాదని, అదొక శాస్త్రం, వివిధ వర్గాల ప్రజలను కలిపే వారధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి వారసత్వ సంపదను ఉపయోగించుకోవాలని సూచించారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సు ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు.
చరిత్రాత్మక కట్టడాలు వారసత్వంగా వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు అప్పటి కాలంలోకి వెళ్తామని ఉద్ఘాటించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం, తమిళనాడులోని బృహదీశ్వరాలయం ఘనమైన వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతను నిలయమైన మన దేశంలో ఈ సదస్సు జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న డబ్ల్యూహెచ్‌సీ సదస్సుకు భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 31 దాకా ఈ సదస్సు జరుగనుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.