శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి! | TMC Faces A Shiv Sena Style Political Crisis As Internal Rebellion And Party Split Deepen In Bengal, More Details Inside | Sakshi
Sakshi News home page

శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!

Jul 4 2026 9:12 AM | Updated on Jul 4 2026 9:55 AM

TMC Faces Shiv Sena Style Crisis as Party Split Deepens

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎదుర్కొన్న ‘‘పార్టీ ఎవరిది?” అనే సంక్షోభం.. దేశ రాజకీయాల్లోనే పెద్ద మలుపుగా నిలిచింది. నాయకత్వం, గుర్తు, ఎమ్మెల్యేలు.. అన్నీ ఒకేసారి చీలిపోయి చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ తుపాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చుట్టూ తిరుగుతుండడంతో.. బెంగాల్‌ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

తాజాగా కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గం కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించడం.. లోపలే సమావేశాలు నిర్వహించడం.. “మాదే అసలు టీఎంసీ” అంటూ ప్రకటించుకోవడం.. మళ్లీ తాళాలు వేసుకుని వెళ్లడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ బల ప్రదర్శన స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇది అప్పటి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో జరిగిన.. మహా పొలిటికల్‌ డ్రామాను తలపిస్తోంది.

మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కూడా ఇదే తరహా రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టి, అసెంబ్లీ సంఖ్యాబలం ఒక్కసారిగా మారిపోయింది. గోవా, గుజరాత్ క్యాంప్‌లలో జరిగిన రాజకీయ కదలికల తర్వాత చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఉద్ధవ్ వర్గం, మరోవైపు షిండే వర్గం అంటూ అసలు శివసేన ఎవరిదన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తు, పేరు, అధికారిక హక్కులపై జరిగిన పోరులో.. షిండే పై చేయి సాధించారు. దీంతో బెంగాల్‌లోనూ సీన్‌ రిపీట్‌ కాక తప్పదా? అనే చర్చ జోరందుకుంది.

ఇక బెంగాల్‌ టీఎంసీ సంక్షోభానికి కేవలం ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా ఎంపీల స్థాయిలో కూడా కొనసాగుతుందని తెలిసిందే.  టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీల్లో 20 మంది సభ్యులు ఎన్సీపీఐ అనే రాజకీయ వేదికలో విలీనం కావడం.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం.. తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకు..

ఇదే తరహా రాజకీయం మహారాష్ట్రలోనూ కనిపించింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీల్లో కొందరు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధపడ్డారు.  శివసేన సంక్షోభ సమయంలో ఎలా అయితే ఎమ్మెల్యేల మార్పు జరిగిందో.. ఇప్పుడు బెంగాల్‌లోనూ అదే తరహా చీలిక ఎపిసోడ్‌ నడుస్తోంది. అలాగే.. ఇరు చోట్ల “పార్లమెంటరీ షిఫ్టింగ్” ఒకేసారి చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. 

పార్టీలో అంతర్గత చీలిక.. ఎమ్మెల్యేల వేరు వర్గం.. ఎంపీల షిఫ్టింగ్.. మహారాష్ట్ర, బెంగాల్‌ రాజకీయాల్లో ఒకే ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద టీఎంసీ పార్టీ పేరు, గుర్తు, నిర్మాణంపై హక్కుల వివాదం పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే శివసేన తరహా సంక్షోభమే ఇప్పుడు టీఎంసీకి కూడా ఎదురవుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement