విజయ్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు? | vijay wants to shift his office bjp alleges corruption | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు?

Aug 18 2026 7:31 PM | Updated on Aug 18 2026 7:44 PM

vijay wants to shift his office bjp alleges corruption

చెన్నై: తమిళనాడులో సీఎం కార్యాలయ మార్పు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌ కొత్త కార్యాలయానికి మారాలన్న నిర్ణయం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ నుంచి నామక్కల్‌ కవింగర్‌ మాలిగైకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

బీజేపీ నేత సీఆర్‌ కేశవన్‌ ఈ అంశంపై స్పందిస్తూ.. కొత్త టీవీకే ప్రభుత్వం ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొస్తామని పదేపదే చెబుతోందని, అయితే కొత్త ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం వెల్లడించిందని అన్నారు. 

ఆయన మాట్లాడుతూ "టెండర్‌ విలువ సుమారు రూ.5.5 కోట్లు. టెండర్‌ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. అప్పుడే ప్రభుత్వం ఈ ఆరోపణలతో పరిశీలనకు గురవుతోంది. అయితే, టెండర్‌లో అవకతవకలు ఉన్నాయని ఒక ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. టెండర్‌ను ఆన్‌లైన్‌లో కూడా ఆహ్వానించలేదని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలి" అని కేశవన్‌ అన్నారు.

అయితే ఈ ఆరోపణలు మంత్రి, టీవీకే నేత ఆధవ్‌ అర్జున ఖండించారు. టెండర్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి విజయ్‌ తన కోసం మాత్రమే సౌకర్యవంతమైన కార్యాలయం కోరుకోవడం లేదని, తనతో కలిసి పనిచేసే అధికారులు, సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారని చెప్పారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న ప్రదేశం 100 చదరపు అడుగుల కంటే కూడా తక్కువగా ఉందని ఆధవ్‌ అర్జున తెలిపారు. అందుకే తాత్కాలికంగా కార్యాలయాన్ని మరో భవనానికి మార్చే ప్రణాళిక రూపొందించామని చెప్పారు.ముఖ్యమంత్రి విజయ్‌ చాలా సాధారణంగా, సౌకర్యాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పనిచేసే వ్యక్తి అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాధారణ హోటల్‌లో లేదా వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు.

టెండర్‌ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి బినామీ కంపెనీలను ఉపయోగించబోమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement