మరో జలసాధన ఉద్యమ కార్యాచరణకు బీఆర్‌ఎస్ శ్రీకారం
సాగునీటి సంక్షోభం, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రజాక్షేత్రంలోకి...
ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి పదును
కాళేశ్వరం పరీవాహక రైతులతో భారీ సభకు యోచన
ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల్లో రిజర్వాయర్ల సందర్శనకు షెడ్యూల్‌పై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన నీళ్ల నినాదం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారుతోంది. వర్షాభావం, అడుగంటుతున్న జలాశయాలు, పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు రాష్ట్ర రైతాంగం మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగునీరు, రైతాంగ సమస్యలను అస్త్రంగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లే కార్యాచరణకు బీఆర్‌ఎస్ పదును పెడుతోంది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా గణాంకాలు, సాంకేతిక వివరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి గోదావరిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోయడంలో రేవంత్ ప్రభు త్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. 31 నెలలుగా కాళేశ్వరంపై వాస్తవాలను ప్రభు త్వం దాచి పెడుతోందని ఆరోపించిన కేటీఆర్.. తమకు ప్రాజెక్టు నిర్వహణను అప్పగిస్తే నీటిని ఎలా ఎత్తిపోయాలో చూపిస్తామని సవాల్ చేశారు. మరోవైపు అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడు నెలలు తనకు నీటిపారుదల శాఖను అప్పగిస్తే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి చూపిస్తానని సవాల్ విసిరారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆందోళనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల కేంద్రంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు బీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది. అయితే కేవలం సవాళ్లు, ప్రతిసవాళ్లకు పరిమితం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పరీవాహక ప్రాంత రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తోంది. ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల్లో సభలు, సమావేశాలు, బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల సందర్శన వంటి కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆమోదం తర్వాత కాళేశ్వరం ఉద్యమ కార్యాచరణపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రైతుల భాగస్వామ్యంతో ఉద్యమం
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, పంటల ప్రణాళిక అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశాన్ని రాజకీయ కోణంలో బలంగా ప్రస్తావిస్తున్న బీఆర్‌ఎస్.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడాన్ని తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు, రైతుల వద్దకే నేరుగా వెళ్లి ఉద్యమ కార్యాచరణను అమలు చేయాలనుకుంటోంది. ఎస్సారెస్పీ వరద కాలువకు నీటిని విడుదల చేయాలనే డిమాండుతో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్దమవుతోంది.
తుంగభద్ర నదిపై కర్ణాటక, ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ నేతల బృందం రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌ను సందర్శించింది. తుంగభద్రతోపాటు కృష్ణ, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ఉద్యమబాట పట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపిస్తోంది. నిధుల విడుదలతోపాటు పనులు ప్రారంభించాలనే డిమాండుతో రైతులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టేందుకు హరీశ్‌రావు సిద్ధమవుతున్నారు.


