దైవాలగూడ ఘటన: భగ్గుమన్న షాబాద్‌.. ఎస్‌ఐపై వేటు | Daivalaguda Incident: High Tension At Shabad Chowrastha | Sakshi
Sakshi News home page

దైవాలగూడ ఘటన: భగ్గుమన్న షాబాద్‌.. ఎస్‌ఐపై వేటు

Jul 11 2026 1:55 PM | Updated on Jul 11 2026 2:07 PM

Daivalaguda Incident: High Tension At Shabad Chowrastha

సాక్షి, రంగారెడ్డి: షాబాద్‌ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడు రాజ్‌కుమార్‌ ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు షాబాద్‌ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆందోళన చేస్తున్న గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి స్వయంగా అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ కీలక ప్రకటనలు చేశారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రమేశ్‌ను సస్పెండ్‌ చేశామని, దర్యాప్తులో ఎవరిపై బాధ్యత తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే హత్యాకాండలో ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. 

పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. 
అంతకు ముందు.. ఈ ఉదయం బాధిత బాలిక బంధవులు, గ్రామస్తులు హైవేపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలని..  ఆ నరరూప రాక్షసుడి సంగతి తేలుస్తామంటూ నినాదాలు చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లను పెట్టి.. పోక్సో కేసు నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారని.. అరెస్టై రెండు నెలలు తిరగకముందే నిందితుడిని వదిలేశారని ఎస్సైపై గ్రామస్తులు ఆరోపణలు గుప్పించారు. ఒకానొక టైంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఎమ్మెల్యేకు చేదు అనుభవం
గ్రామస్తుల ఆందోళన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య.. షాబాద్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామస్తులకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. 

ఏం జరిగిందంటే..
దైవాలగూడ గ్రామానికి చెందిన పార్వతి రాజ్‌కుమార్‌ ఓ మైనర్‌ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించ సాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్‌ చేశారు. శుక్రవారం స్టేషన్‌ బెయిల్‌ మీద రాజ్‌కుమార్‌ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు.

ముందే బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు?
దైవాలగూడ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. శంషాబాద్‌లో ఇంటర్‌ పరీక్షలు రాయడానికి వెళ్లిన బాధితురాలిని రాజ్‌కుమార్‌ బెదిరించినట్లు తెలుస్తోంది. "మీ నాన్నను ఎలా చంపేశానో.. మిమ్మల్నీ అలాగే చంపేస్తా"** అంటూ రాజ్‌కుమార్‌ గతంలోనే బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపించారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈ మారణహోమం జరిగేది కాదని, ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరారైన కారు గుర్తింపు..
మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు అతను ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారు వదిలేసి సమీప రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అతడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు కారు రెంట్‌కు ఇచ్చిన ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నేతల అరెస్టులు
ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దైవాలగూడకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ నేతలకు పోలీసులు చేవెళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిలు ఉఉన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, పట్నం నరేందర్‌రెడ్డిలను శంకర్‌పల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో షాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఒకవైపు గ్రామస్తుల ఆందోళనలు, మరోవైపు పోలీసులపై తీవ్ర ఆరోపణలు, ఇంకోవైపు ప్రతిపక్ష నేతల అరెస్టులతో **షాబాద్‌ హత్యాకాండ** రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టుకోవడంపై, అలాగే పోలీసుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement