యువతి మృతి.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం
హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్ పీజీ హాస్టల్‌లో ఉంటూ టెలికాంనగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది.
మరో సేల్స్ గర్ల్ ఎస్.సుహాసిని(30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలో వెనక నుంచి వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది.


