‘పోక్సో’ నిందితుడి పగ.. ఆరుగురి దారుణ హత్య | Six Murders in Three Hours: Daivalaguda Rajkumar in absconding | Sakshi
Sakshi News home page

‘పోక్సో’ నిందితుడి పగ.. ఆరుగురి దారుణ హత్య

Jul 12 2026 1:47 AM | Updated on Jul 12 2026 1:48 AM

Six Murders in Three Hours: Daivalaguda Rajkumar in absconding

మృతుల్లో భార్య, ఇద్దరు పిల్లలు, పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నానమ్మ

కత్తితో పొడిచి, గొంతులు కోసి హతమార్చిన కిరాతకుడు 

బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య! 

షాబాద్‌ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఘాతుకం.. పరారీలో నిందితుడు... ఆచూకీ చెప్పిన వారికి రూ.2 లక్షల నజరానా 

ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌ జోషి ప్రకటన 

పోక్సో కేసులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్‌.. బాధిత కుటుంబం ఆందోళనలతో అట్టుడికిన షాబాద్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోక్సో కేసులో నిందితుడు పగతో రగిలిపోయాడు. రాక్షసుడిలా మారాడు. వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను మట్టుబెట్టిన ఈ రాక్షసుడు, వారికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ కడతేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్యాకాండ చోటు చేసుకోగా, శనివారం ఉదయం ఈ ఘోరం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో ఈ మారణకాండ జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

ఆస్తులమ్ముతూ.. అప్పులు చేస్తూ 
దైవాలగూడకు చెందిన పార్వతి అరుణ్‌కుమార్, శకుంతల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కొడుకైన రాజ్‌కుమార్‌ (28)కు చదువు సంధ్యా లేదు. జులాయిగా తిరిగేవాడు. తల్లిదండ్రులను బెదిరించడం..ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయడం, ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సాలు చేయడం, యువతులను వేధించడం..ఇదే పని. మరోవైపు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు, బంధువుల వద్ద రూ.కోటికి పైగా అప్పు చేశాడు. చెల్లించమని అడిగితే మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు.  

రాజ్‌కుమార్‌

ప్రేమించానంటూ వెంట పడి..పెళ్లి చేసుకుని.. 
ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన తనకంటే వయసులో ఐదేళ్లు పెద్దదైన కప్పెర సరిత (32)ను ప్రేమించానంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె కుటుంబసభ్యులు అప్పటికే మరో వ్యక్తితో వివాహం నిశ్చయించినా దాన్ని చెడగొట్టాడు. 2018లో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సరితను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో భార్యతో కలిసి షాబాద్‌లోని ఇంట్లో కాపురం పెట్టాడు. వారికి పరీక్షిత్‌ (4), దైవిక్షిత్‌ (2) పుట్టారు.  

మైనర్‌ బాలికపై కన్నేసి.. 
షాబాద్‌లో పక్కింట్లో నివసిస్తున్న ఓ కుటుంబంతో రాజ్‌కుమార్‌ సన్నిహితంగా మెలిగేవాడు. ఆ ఇంట్లో ఉండే బాలిక (17)పై కన్నేశాడు. శంషాబాద్‌లోని కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె తండ్రిని మంచి చేసుకునేందుకు నిత్యం మత్తులో ముంచి తేల్చేవాడు. ఏడాది క్రితం బాలిక తండ్రి మరణించడంతో రాజ్‌కుమార్‌ అకృత్యాలకు అడ్డులేకుండాపోయింది. విషయం తెలియడంతో బాలిక తల్లి లక్ష్మి (38) పద్ధతి మార్చుకోవాలని రాజ్‌కుమార్‌ను పలుమార్లు హెచ్చరించింది. ఫలితం లేకపోవడంతో ఆరు నెలలుగా కూతుర్ని ఇంట్లోనే ఉంచింది. స్వయంగా తానే తీసుకెళ్లి వార్షిక పరీక్షలు రాయించింది. 

ఈ సమయంలో బాలికను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మే 16న లక్ష్మి షాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు మైనర్‌ కావడంతో పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 78, 351, 11, ఆర్‌/డబ్ల్యూ12 కింద కేసు నమోదు చేశారు. దీంతో రాజ్‌కుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉండగా.. కొద్దిరోజుల తర్వాత రాజ్‌కుమార్‌ ముందస్తు బెయిల్‌ తెచ్చుకుని బయట తిరగడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో షాబాద్‌లోని ఇంటిని ఖాళీ చేసి, స్వగ్రామమైన దైవాలగూడకు వచ్చి రెండు నెలలుగా భార్య, పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు.  

తనపై కేసుకు భార్య కూడా కారణమని.. 
తనపై పెట్టిన పోక్సో కేసుకు బాలిక కుటుంబ సభ్యులతో పాటు భార్య సరిత కూడా కారణమని భావించిన రాజ్‌కుమార్‌ ఆమెపై కూడా కక్ష పెంచుకున్నాడు. అందరినీ చంపేస్తానంటూ తరచూ భార్యతో అనేవాడు. శుక్రవారం రాత్రి బిర్యానీ ప్యాకెట్లు, బీరు బాటిళ్లు తీసుకుని దైవాలగూడలోని ఇంటికి చేరుకున్నాడు. పిల్లలకు బిర్యానీ తెచ్చానని భార్యకు చెప్పి స్వయంగా తినిపించాడు. కొద్దిసేపటి తర్వాత భార్యతో గొడవపడి కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కుమారుల గొంతు కోసి మృతదేహాలను మంచంపై పడేశాడు. ఈ సమయంలో అరుపులు, కేకలు బయటకు వినిపించకుండా ఏసీ, కూలర్, టీవీ ఆన్‌చేసి ఉంచాడు.  

పీకలదాకా తాగి..బాలిక ఇంటికి వెళ్లి.. 
భార్యాపిల్లల హత్యల అనంతరం పీకల దాకా మద్యం తాగి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తన కారులో షాబాద్‌కు చేరుకున్నాడు. పీఆర్‌ఆర్‌ స్టేడియంలో కారును పార్కు చేసి స్టేడియం ప్రహరీ దూకి బాలిక ఇంటికి చేరుకున్నాడు. బాలిక తల్లి లక్ష్మి తలుపులు తెరవగా వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. ఈ అలికిడికి మంచంపై నిద్రిస్తున్న బాలిక నానమ్మ రుక్కమ్మ (60) అరవడంతో ఆమె గొంతుకోసి చంపాడు. అక్కడే ఉన్న బాలిక సోదరి (దివ్యాంగురాలు)ని మాత్రం వదిలేశాడు. రాత్రి 11.10 గంటల సమయంలో బాలిక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లాడు. ఈ దృశ్యం ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను కారులో ఎక్కించుకుని తాను నివసించిన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న నాగరికుంట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. కత్తితో బాలిక గొంతు కోసి హత్య చేశాడు. 

అంతకుముందు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు తెలిసింది. 11:40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన రాజ్‌కుమార్‌.. తనపై పోక్సో కేసు పెట్టిన బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను చంపేశానని, భార్యా పిల్లల్ని కూడా చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికతో పాటు లక్ష్మి, రుక్కమ్మ మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, దైవాలగూడలోని భార్యాపిల్లల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే రాజ్‌కుమార్‌.. తొలుత బాలికతో పాటు ఆమె తల్లి, నాన్నమ్మను హత్య చేశాడని, ఆ తర్వాత దైవాలగూడలో భార్య, పిల్లలను హతమార్చాడని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

8712665324 నంబర్‌కు ఫోన్‌ చేయాలి: సీపీ 
హంతకుడు రాజ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని, ప్రత్యేక పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి విలేకరులకు చెప్పారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నజరానా అందజేస్తామని అన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే చేవెళ్లలో ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూం 8712665324 నంబర్‌కు ఫోన్‌ చేయాలని, లేదంటే వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు షాబాద్‌లోని బాలిక ఇంటికి చేరుకున్న రాజ్‌కుమార్‌..వరుసబెట్టి ఆమె తల్లి లక్ష్మి, నాన్నమ్మ రుక్కమ్మతో పాటు ఆ తర్వాత బాలికను చంపాడని చెప్పారు. అనంతరం దైవాలగూడకు వచ్చి భార్య, పిల్లలను హత్య చేశాడని తెలిపారు. నిందితుడిపై ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉండటంతోనే బెయిల్‌ వచ్చిందని వివరించారు. బాలిక తండ్రిని కూడా రాజ్‌కుమార్‌ చంపినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయన గుండెపోటుతోనే చనిపోయినట్లు వైద్యుల నివేదికను బట్టి తెలుస్తోందని సీపీ చెప్పారు. పోక్సో కేసు తర్వాత రాజ్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా నిర్లక్ష్య చూపారనే ఆరోపణల నేపథ్యంలో షాబాద్‌ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు.  

ఉలిక్కిపడిన షాబాద్‌ 
ఆరు హత్యలతో షాబాద్‌ మండలం ఉలిక్కిపడింది. స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, ఉరి తీయించాలని డిమాండ్‌ చేస్తూ బాలిక బంధువులు, గ్రామస్తులు షాబాద్‌ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఇటు షాద్‌నగర్, అటు చేవెళ్ల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ రోడ్డు మార్గాలను మూసివేశారు. బాధితులతో మాట్లాడేందుకు వచ్చిన మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రా«థోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లను చేవెళ్ల సమీపంలోని మల్కాపూర్‌ స్టేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  

రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించిన కలెక్టర్‌ 
జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి శనివారం మధ్యాహ్నం షాబాద్‌ చేరుకున్నారు. బాలిక బంధువులను పరామర్శించారు. న్యాయం చేస్తామని చెప్పారు. ఆందోళన విరమించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన దివ్యాంగురాలైన బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. ఇలావుండగా ఆరుగురిని హత్య చేసిన అనంతరం రాజ్‌కుమార్‌ ఎర్రటి కారులో షాద్‌నగర్‌కు చేరుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం నందిగామ మండల పరిధిలోని చేగూరు శివారులో కారును వదిలేసి, శ్రీశైలం మార్గంలో వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ రూట్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

బాలికతో పాటు ముగ్గురి అంత్యక్రియలు  
చేవెళ్ల/షాబాద్‌: రాజ్‌కుమార్‌ చేతిలో హత్యకు గురైన బాలికతో పాటు ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మ అంత్యక్రియలను శనివారం రాత్రి షాబాద్‌లో నిర్వహించారు. రుక్కమ్మ చిన్న కొడుకు రాజు తల్లితో పాటు వదిన, అన్న కుమార్తెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా నిందితుడు రాజ్‌కుమార్‌ భార్యాపిల్లల మృతదేహాలు మాత్రం రాత్రి పొద్దుపోయే వరకు గ్రామానికి చేరలేదు. 

నిత్యం టార్చర్‌ చేసేవాడు.. 
ప్రేమిస్తున్నానని వెంట పడటంతో మా కుటుంబానికి ఇష్టం లేకపోయినా రాజ్‌కుమార్‌కు మా ఆడపడుచు సరితను ఇచ్చి పెళ్లి చేశాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమెను ఏనాడూ ప్రేమగా చూడలేదు. నిత్యం టార్చర్‌ చేసేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత సరిత అందవిహీనంగా తయారైందని వేధించేవాడు. మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పిల్లలముందే ఆమెను కొట్టేవాడు. మైనర్‌ బాలిక కోసం గడ్డి మందుతాగి ఆత్మహత్యకు కూడా యత్నించాడు. 
– మౌనిక, (సరిత ఆడపడుచు) 

నడిరోడ్డుపై ఉరి తీయాలి 
రాజ్‌కుమార్‌ మా కోడలు సరితను నమ్మించి గొంతుకోశాడు. ఆమె ఎంతో కష్టపడి చదువుకుంది. బీఈడీ పూర్తిచేసి ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పని చేసేది. అప్పట్లో ఆమెకు వచ్చిన మంచి సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. పసిపిల్లల ప్రాణాలు తీసిన నరరూప రాక్షసుడు వాడిని అరెస్టు చేసి నడిరోడ్డుపై ఉరి తీయాలి. 
– ఆంజనేయులు (సరిత మేనమామ) 

అత్తమామలు కూడా పట్టించుకోలేదు 
మా చెల్లెలు సరితకు హైతాబాద్‌లో మంచి సంబంధం చూశాం. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేశాము. కానీ రాజ్‌కుమార్‌ చెడగొట్టాడు. తప్పని పరిస్థితుల్లో అతనికే ఇచ్చి పెళ్లి చేశాము. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అత్తమామలు కూడా సరితను కోడలిగా అంగీకరించలేదు. వంట చేసినా తినే వాళ్లుకాదు. తొలి కాన్పులో బిడ్డ పుట్టి చనిపోయింది. అప్పుడు కూడా మా చెల్లిని పట్టించుకోలేదు. ఆ తర్వాత పుట్టిన పిల్లలను చూడటానికి కూడా ఆసుపత్రికి రాలేదు. రాజ్‌కుమార్‌ కఠినంగా శిక్షించడంతో పాటు అతని తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలి. 
– సంజీవ, (సరిత సోదరుడు)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement